వైకాపా చివరికి ఆర్ఆర్ఆర్ కూర్చునే సీటును మార్చగలిగిందన్నమాట

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారశైలి అధికార పార్టీలో ఏ స్థాయి కలకలం రేపిందో అందరికీ విధితమే.  లాజిక్కులు మాట్లాడుతూ ఎక్కడా నిభంధనలకు దొరక్కుండా పలు రకాలుగా పార్టీని చిక్కుల్లోకి నెడుతూ వచ్చిన రఘురామరాజును ఎలా నిలువరించాలో తెలియక సతమతమైపోయారు.  సొంత సామాజిక వర్గ నేతల ద్వారా తిట్టించడం, షోకాజ్ నోటీసులు పంపడం లాంటి అస్త్రాలు ప్రయోగించినా రఘురామరాజు బెదరలేదు సరికదా షోకాజ్ నోటీసును తిప్పి తిప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నెత్తి మీదే పెట్టారు.  దీంతో అధిష్టానానికి చిర్రెతుకొచ్చి స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయాలని చూసింది. 
 
ఒక బృందాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపారు.  కానీ అనర్హత వేటు అంత ఈజీ కాదని చాలా త్వరగానే వైకాపా నేతలకు అర్థమైంది.  దీంతో ఏదో రకంగా ఆర్ఆర్ఆర్ మీద పంతం నెగ్గించుకోవాలని భావించిన వైకాపా నేతలు చివరికి లోక్ సభలో రాఘురామకృష్ణరాజు కూర్చునే సీటును మాత్రం మార్చగలిగింది.  ఈ మేరకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.  ఇన్నాళ్ళు రాఘురామరాజు సీటు నెం 379 లో కూర్చునేవారు.  ఇప్పుడు తాజా ఉత్తర్వుల మేరకు ఆయన వెనక్కు వెళ్లి 445 వ నెంబర్ సీటులో కూర్చోవాల్సి ఉంటుంది.  రాఘురామరాజు పాత స్థానంలో ఎంపీ మార్గాని భరత్ కూర్చుంటారు. 
 
అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్థానాలు ముందుకు మార్చబడ్డాయి.  అంటే లోక్ సభ నందు వైకాపా ఎంపీల బృందంలో రాఘురామరాజును చివరికి నెట్టేశారు.  సాధారణంగా సంఖ్యా బలాన్ని బట్టి లోక్ సభ నందు తమ ఎంపీలు కూర్చునే స్థానాలను ఎంచుకునే వెసులుబాటు పార్టీలకు ఉంటుంది.  ఆ ప్రకారమే 22 స్థానాలతో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైకాపా తన ఎంపీల స్థానాల్లో మార్పులు చేయగలిగింది.  ఈ విధంగా పార్టీ పరంగా లోక్ సభలో రఘురామరాజు ప్రాధాన్యతను తగ్గించి వైకాపా పంతం నెగ్గుంచుకుందన్నమాట.