నారా లోకేష్ అంటే వైసీపీకి ఎంతటి చిన్నచూపో అందరికీ విధితమే. చిన్నదానికి పెద్దదానికి లోకేష్‌ను లాక్కొచ్చి ఎద్దేవా చేస్తుంటారు. ప్రధానంగా విజయసాయిరెడ్డి అయితే లోకేష్‌కు మారుపేర్లు పెట్టి మరీ హేళన చేస్తుంటారు. వైసీపీ నేతల దృష్టిలో లోకేష్ అంటే సున్నా. టీడీపీ మీద ఏ విమర్శ చేయాల్సి వచ్చిన లోకేష్‌ను అసమర్థుడి కింద లెక్కగట్టి కామెంట్లు చేస్తుంటారు. ఇలా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా డీగ్రేడ్ చేయడమనేది ఎంతవరకు సబబో చేసే వాళ్ళు కొంచమైనా ఆలోచిస్తే మంచింది. యథా రాజా తథా ప్రజా అనే సామెతకు అనుగుణంగా వైసీపీ లీడర్లే కాదు వైసీపీ కార్యకర్తలు కూడ లోకేష్ విషయంలో చవకబారు తీరులోనే ఉన్నారు. ఇన్నాళ్లు లోకేష్ మీద సెటైర్లు వేసిన వారు ఇప్పుడు నేరుగానే ఆయన ఉన్న చోటుకే వెళ్లి ర్యాగింగ్ చేసేస్తున్నారు.
తాజాగా లోకేష్ భారీ వర్షాలకు ముంపుకు గురైన కోనసీమ ప్రాంతాలను సందర్శించే పని పెట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ,ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల పర్యటనలు అంటే ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పించడం కామన్. ఇక అధికార పార్టీ విషయంలో అయితే విఫలమయ్యారు, ప్రజలను పట్టించుకోవడంలేదు, బాధితులకు అండగా నిలబడతాం, ప్రభుత్వం తక్షణమే బాధితులను ఆదుకోవాలి లాంటి మాటలు రెగ్యులర్. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి నాయకుడూ చేసే పని ఇదే. లోకేష్ కూడ అదే చేశారు.
కానీ ఇంతలో అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు లోకేష్ మాట్లాడుతుండగా జై జగన్.. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఊహించని ఈ పరిణామంతో లోకేష్, టీడీపీ శ్రేణులు షాకయ్యారు. ఆ వెంటనే టీడీపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం మొదలైంది. స్పాట్లో పోలీసులు ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతేపెద్ద గొడవే జరిగేదట. ఇలా వైసీపీ కార్యకర్తలు కావాలని లోకేష్‌ను చిన్నతనం చేయాలనే దురుద్దేశ్యంతోనే అక్కడకొచ్చి జై జగన్ అనే నినాదాలు చేశారని, రాష్ట్రంలో జగన్, వైసీపీ నాయకులు తప్ప ఇంకెవ్వరూ తిరగకూడదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా సొంత సభల్లోనూ, సోషల్ మీడియాలోనూ, అనుకూల మీడియాలోనూ లోకేష్ మీద అవహేళన విమర్శలు చేయడం అలవాటైపోయిన వైసీపీ శ్రేణులు ఇలా బహిరంగంగా లోకేష్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి ర్యాగింగ్ చేయడం ఏమంత సమర్థనీయమైన చర్య కాదు.