కరోనా కష్టాల సంగతెలా వున్నా, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులెలా వున్నా.. సంక్షేమ పథకాల క్యాలెండర్ విషయమై వైఎస్ జగన్ సర్కార్.. అస్సలేమాత్రం తొణకడంలేదు, బెణకడంలేదు. మాటకు కట్టుబడి ఖచ్చితమైన సమయానికి సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరుతున్నాయి. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా పేరుతో, తొలి విడత ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లోకి నేరుగా పంపింది వైఎస్ జగన్ సర్కార్. సుమారు 52 లక్షల మంది రైతులకు మొత్తంగా దాదాపు 4 వేల కోట్ల రూపాయల్ని జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఈ నెలలోనే మరో 2 వేల కోట్ల రూపాయల్ని ఉచిత పంటల భీమా కోసం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, ప్రతి ఏడాదీ సంక్షేమ క్యాలెండర్ పక్కగా అమలు చేస్తున్నప్పుడు, ఆయా తేదీల్లో పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికల్లో ఎందుకు.? అన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. కరోనా నేపథ్యంలో ప్రతి రూపాయీ ప్రభుత్వానికి ఎంతో విలువైనది.
ప్రకటనల కోసం చేసే ఖర్చుని అదనంగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడమో, కరోనా మహమ్మారిపై పోరాటం కోసమో ఉపయోగిస్తే మంచిదన్నది చాలామంది అభిప్రాయం. కరోనా విపత్తు వేళ, రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో ఆర్థికంగా ఊరట కలిగిస్తున్న జగన్ ప్రభుత్వం, ఈ అనవసర పబ్లిసిటీ చేయడం ద్వారా మంచి పేరు చెడగొట్టుకుంటోందన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. అయితే, చేస్తున్న మంచి పనుల గురించి చెప్పుకోవడానికి చాలా తక్కువ ఖర్చుతో పబ్లిసిటీ చేసుకోవడం తప్పేమీ కాదన్నది అధికార పార్టీ నేతలు చెబుతున్న మాట. చంద్రబాబు హయాంలో కేవలం పబ్లసిటీ స్టంట్లు మాత్రమే చేశారనీ, తాము నిఖార్సుగా పనిచేస్తున్నామని వైసీపీ నేతలంటున్నారు. విపక్షాలు ప్రతి విషయానికీ దుష్ప్రచారం చేస్తున్న దరిమిలా, ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి ఈ స్థాయి ప్రచారం తప్పనిసరి.. అని వైసీపీ నేతలు కుండబద్దలుగొట్టేస్తున్నారు.