ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో జరిగిన శిరోముండనం ఘటనపై స్పందించిన మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ… నక్సలైట్స్ లలో ఇష్టమున్న వారు చేరవచ్చని, వారికి పోలీసులు తగిన బుద్ది చెప్తారని వ్యాఖ్యానించారు. దళితుడైన మంత్రి , దళితుడికి జరిగిన అన్యాయంపై స్పందించి, విచారణ జరిపి, చర్యలు తీసుకోవలసిన వ్యక్తి ఇలా భాధ్యతారహితంగా మాట్లాడటం తగదని విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే చాలా దళితులకు అన్యాయం జరిగిందని, అన్యాయం జరిగిన వారందరు నక్సలైట్స్ లలో చేరితే ఎవరు బాధ్యులను టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు ఆలోచించకుండా చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవమాన పడాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సీతానగరంలో వరప్రసాద్ అనే యువకుడిని వైసీపీ కార్యకర్తల ఫిర్యాదు నిమిత్తం అరెస్ట్ చేసి, విపరీతంగా కొట్టి, శిరోముండనం చేసి వదిలేశారు. ఈ ఘటన వల్ల మనస్తాపానికి గురైన యువకుడు తనను అవమానించిన వారిపై పగ తీర్చుకోవడానికి నక్సలైట్స్ లో చేరడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి వెంటనే స్పందించి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో అసిస్టెంట్ సెక్రటరీ ఏ జనార్దన్ బాబుకు ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేశారు. నేరుగా జనార్దన్ బాబుని కలవాలని వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. శిరోముండనం ఘటనపై పూర్తి స్థాయి కాల్ రికార్డులు, వీడియో క్లిప్పులు, కాల్ రికార్డింగ్‌లతో వరప్రసాద్ జనార్దన్ బాబుని కలవనున్నారు. మరోవైపు రాష్ట్రపతి స్పందనపై శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి జోక్యంతో తనకు న్యాయం దక్కుతుందనే భరోసా ఏర్పడిందని చెప్పారు.