ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్న ప్రజా ప్రతినిధులు.. ఇలాగైతే రాష్ట్రం బాగుపడేదెప్పుడు.. ? 

 

ప్రజలు నాయకులను ఎన్నుకునేది జనరంజకంగా పాలన చేస్తారని. కాని నేటి రాజకీయాలు ప్రజల కన్నీరు తుడచడానికి, పిడికెడు కడుపు నింపడానికి కూడా పనికి రావడం లేదు. ఎక్కడా చూడూ, ఏ పార్టీ నాయకులను చూడూ అవినీతి ఆరోపణలతో నిండా మునిగిపోతున్నారట.. ప్రజలపాలిట శాపంగా మారుతున్న ఈ రాజకీయాల ప్రక్షాళన జరిగేది ఎప్పుడో అని చింతించే వారు కూడా లోకంలో లేకపోలేదు. ఇక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యనాయకుడు మంచి వారైతే సరిపోదు, ఆ పార్టీలోని ఇతర నాయకులు కూడా అవినీతి మరకలకు దూరంగా ఉండాలి.. కానీ ఇది జరగడం అసాధ్యం.. ఇక అధికారంలోకి వచ్చిన పార్టీ, అధికారాన్ని కోల్పోయిన పార్టీ చేసిన బొక్కలు బయటపెట్టడం, ఆ తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు వారి పదవికోల్పోయాక మళ్లీ అధికారంలోకి వచ్చిన వారు ఇదేపనిని వారసత్వంగా చేయడం రాజకీయాల్లో పరిపాటే..

ఇలా ఒకరి పరువు ఒకరు తీసుకుంటూ, ఆ మీ ప్రభుత్వం అసమర్ధంగా పనిచేసిందని అంటే కాదు మీ ప్రభుత్వానికి పాలించడం చేతగాక మా మీద నిందలు వేస్తున్నారని దూషించుకోవడం. ఇలా ప్రజా సమస్యల కోసం వెచ్చించ వలసిన సమయాన్ని దుర్వినియోగం చేయడం మన ప్రజా ప్రతినిధులకు బాగా అలవాటైన విషయం.. దీని వల్ల ఆ రాష్ట్ర ప్రజల్లో చులకన అవుతున్నామనే ఇది కూడా ఉండదు.. ఇకపోతే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే రాష్ట్రాల డిమాండ్లు ఎక్కువగా విన్పించాలి, కానీ ఏపీ ఎంపీలు అందుకు విరుద్ధమట.. కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని ఆర్భాటంగా ప్రకటిస్తారు, చివరకు సమావేశాలు ప్రారంభమయిన తర్వాత దాని ఊసే ఉండదు. వైసీపీ, టీడీపీ పై కక్ష సాధింపు కోసం ఆందోళన చేస్తే, టీడీపీ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వాదించుకుంటారని ప్రచారం జరుగుతుంది.

అదీగాక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు ఇంతవరకు పోరాడలేదట. ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ఒరిగింది ఏమిలేదని, ప్రస్తుతం వైసీపీ పదిహేను నెలలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే తంతు అని అనుకుంటున్నారట. ఇదేకాకుండా రెండు పార్టీలు రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో ఒకరిపై ఒకరిని విమర్శించుకుంటూ పలుచన అవుతున్నాయట. పార్లమెంటు సమావేశాల సందర్భంగా, రాష్ట్రానికి రావాల్సిన దానిపై కాకుండా.. వైసీపీ, టీడీపీలు రాష్ట్ర పరువును ఢిల్లీ వీధుల్లో తీసేస్తున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.. ఇలా రెండు పార్టీలు పార్లమెంటు సమావేశాలను రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా, తమ పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించు కుంటున్నాయి అని అంటున్నారట కొందరు ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు..