వైఎస్ వివేకా కుమార్తెకు ప్రాణ భయం.. ఎవరి నుంచి.?

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తనకు ప్రాణ భయం వుందంటూ పోలీసుల్ని ఆశ్రయించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సునీత ఇంటి వద్ద అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి సంచరించారట. సదరు వ్యక్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి అనుచరుడట. ఈ వివరాల్ని సునీత, పోలీసులకు తెలిపారు. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వివరాల్ని కూడా పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం ఆ వైఎస్సార్సీపీ నేత కూడా వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటుండడం గమనార్హం. ఆయనెవరో కాదు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. అయితే, ఇది ఉత్త ఆరోపణ మాత్రమేనా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన విషయం విదితమే.

పలువురు అనుమానితుల్ని సీబీఐ విచారిస్తోంది. కొందర్ని అదుపులోకి కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో సీబీఐ ఎప్పుడు ఎవర్ని విచారణకు పిలుస్తుందో, ఎవర్ని అరెస్ట్ చేస్తుందో తెలియని పరిస్థితి. చిత్రమేంటంటే చాలామంది వైసీపీ నేతలో, మద్దతుదారులో అరెస్టవడం లేదా విచారణను ఎదుర్కోవడం జరుగుతుండడం. అసలు వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు.? వైఎస్ వివేకాని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల్ని విచారిస్తుండడంతో.. వారంతా వైసీపీ నేతలు, వైసీపీ మద్దతుదారులు కావడంతో.. ఈ విషయం విపక్షాలకు ఆయుధంగా మారుతోంది.. అధికార వైసీపీ మీద విమర్శలు చేయడానికి. అయితే, వైఎస్ వివేకా కుమార్తె సునీత తమకు ప్రాణ భయం పొంచి వుందని ప్రకటించడంతో.. విపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది.