వివేకా హత్య కేసు : సీబీఐ అనుమానితుల లిస్ట్‌లో వైసీపీ నేత‌లు..?

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా అనుమానితుల‌ను విచారిస్తూ, ఈ కేసుకు సంబంధించి విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. ఇక ఇప్ప‌టికే ప్రాథమిక విచారణలో పులివెందులలో వివేకా ఇంటిని సీబీఐ అధికారులు జల్లెడ పట్టారు. ఇప్ప‌టికే వివేకా కేసులో కీలకంగా ఉన్న అనుమతులు జాబితాను సిద్ధం చేసుకున్న సీబీఐ.. ఆ లిస్ట్‌లో దాదాపు 15 మందిని అనుమానితులుగా చేర్చింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆ లిస్ట్‌లో ఉన్న వారిని దశల వారీగా వారిని విచారించనున్నారు సీబీఐ అధికారులు.

ఇప్ప‌టికే వివేకా ఇంటి వాచ్ మెన్, ప్రధాన నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డి, అలాగే వివేకా పీఏ, డ్రైవర్ ప్రసాద్, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సహా పలువురుని సీబీఐ అధికారులు విచారించారు. ఇక మంగ‌ళ‌వారం ప్రాథ‌మిక స‌మాచారం కోసం వివేకా కూతురు సునీత‌ను దాదాపు ఏడు గంట‌ల‌పాటు విచారించారు సీబీఐ అధికారులు, ఆమె తెలిపిన వివరాలు, విచారణలో భాగంగా వచ్చిన పలు కీల‌క అంశాల ఆధారంగా ఎవరెవరిని విచారించాలనే దాని పై సీబీఐ అధికారుల‌కు ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక బుధవారం కొంద‌రు వైసీపీ నేతల్ని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ముందుగా పులివెంద‌లు వైసీపీ నేత దేవిరెడ్డి శంక‌ర్ రెడ్డిని విచారిస్తున్నారు. అలాగే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ వై ఎస్ మనోహర్ రెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించనున్నార‌ని తెలుస్తోంది. ఇక వారితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి లు కూడా సీబీఐ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో వీరికి త్వరలోనే వీరికి సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని స‌మాచారం. దీంతో ఈ కేసులో భాగంగా సీబీఐ అధికారు.. ఎప్పుడు ఎవ‌రిని పిలిపిస్తారో.. ఎవరెవ‌రిని క‌స్టడీలోకి తీసుకుంటారో అనేది కీల‌కంగా మారింది. ఈ క్ర‌మంలో ప‌లు అరెస్టులు కూడా ఉండవ‌చ్చ‌ని స‌మాచారం.