YS Viveka Death Mystery : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమేంటో ఇంతవరకు తేల్చలేకపోవడం వ్యవస్థల వైఫల్యంగానే చెప్పుకోవాలి. ఎంపీగా పని చేశారు, ఎమ్మెల్సీగా పని చేశారు.. మంత్రిగా కూడా సేవలందించారు వైఎస్ వివేకానందరెడ్డి. అంతటి వ్యక్తి దారుణ హత్యకు గురైతే, హంతకులెవరో దొరక్కపోవడం ఆశ్చర్యకరమే.
మూడేళ్ళవుతోంది వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత కిరాతకంగా హత్యకు గురై. అప్పటినుంచీ ఇప్పటిదాకా అనేక ఊహాగానాలు (YS Viveka Death Mystery) . ‘నారాసుర రక్తచరిత్ర..’ అని వైసీపీ ఆరోపిస్తే, ‘జగనాసుర రక్తచరిత్ర’ అంటూ టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఇది ఎవరు రాసిన రక్తచరిత్ర.? అన్నది మాత్రం తేలడంలేదు.
కాగా, వైఎస్ వివేకా కుమార్తె ఒంటరి పోరాటం చేశారు.. సీబీఐ విచారణ కోసం. ఎట్టకేలకు సీబీఐ విచారణ షురూ అయినా, ఆ సీబీఐ కూడా ఇంతవరకు దోషులెవరో తేల్చలేదు. ఇంకోపక్క వాంగ్మూలాలంటూ, లీకులు బయటకు వస్తున్నాయి. అన్నిటిలోనూ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే, తమ ఎంపీ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అధికార వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ లీకుల వెనుక పెద్ద కుట్ర వుందన్నది వైసీపీ ఆరోపణ.
ఒక్కటి మాత్రం నిజం.. సీబీఐ లాంటి విచారణ సంస్థలు లీకులకు ఆస్కారమివ్వకూడదు. విచారణ జరగాల్సిన రీతిలో జరగాలి, దోషులెవరో బయటపడాలి. అంతేగానీ, లీకులు పంపడం ద్వారా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తే అది ఎవరికీ మంచిది కాదు.
2019 ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య ద్వారా వైసీపీ రాజకీయ లబ్ది పొందిందని సునీత ఆరోపించినట్లుగా ‘వాంగ్మూలం’ బయటకు రావడం వెనుక రాజకీయ కుట్ర వుందా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.