YS Viveka Death Mystery : జరిగిన హత్య అత్యంత కిరాతకమైనది. ఎవరు ఆ హత్యకు ఒడిగట్టారన్నది తేలాల్సిందే. కానీ, తేల్చేది ఎవరు.? రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయ్.. అయినా, ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు నిగ్గుతేలడంలేదు.
నిజానికి, దేశంలో రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, సీబీఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ, కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భమిది. లేకపోతే, ఇన్నేళ్ళుగా కేసు విచారణ ఓ కొలిక్కి రాకపోవడమేంటి.?
సీనియర్ పొలిటీషియన్, కీలక పదవుల్ని చేపట్టిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనే న్యాయం జరగకపోతే, సామాన్యుడికెలా న్యాయం జరుగుతుందన్న ఇంగితాన్ని అన్ని రాజకీయ పార్టీలూ విస్మరించాయి. అన్ని వ్యవస్థలూ అలాగే తగలబడ్డాయి.
చంద్రబాబే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టేట్మెంట్ పాస్ చేసేశారు. కాదు, ఎన్నికల్లో గెలవడానికి బాబాయ్ వివేకానందరెడ్డిని వైఎస్ జగన్ చంపించేశారని చంద్రబాబు ఆరోపించేశారు. చేతిలో అధికారం వున్నప్పుడు చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించలేదు, వైఎస్ జగన్.. చంద్రబాబుని అరెస్టు చేయించలేదు.
సరే, రాజకీయాల్లో ఆరోపణలు ఇలాగే తగలడతాయని సరిపెట్టుకుందామా.? అంటే, ఓ వృద్ధుడ్ని.. అత్యంత కిరాతకంగా చంపేశారంటే.. అస్సలు క్షమించకూడని నేరమది. కసితీరా నరికి నరికి చంపేశారు వైఎస్ వివేకానందరెడ్డిని. ఈ దారుణ హత్య కేసులో విచారణ సజావుగా సాగేలా రాజకీయ పార్టీలు సహకరించాలిగానీ, తాము చెబుతున్న మాటలే అంతిమ తీర్పులన్నట్టు వ్యవహరించడం ఎవరికీ సబబు కాదు.