ఒకరేమో వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్, ఇంకొకరేమో వైఎస్ వివేకాందరెడ్డికి అనుచరుడు. ఈ ఇద్దరి మధ్యా ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. వాచ్‌మెన్ రంగయ్య పలుకుబడి లేని నిరుపేద. గంగిరెడ్డి కథ వేరు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డిపై రంగయ్య ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు సీబీఐ ముందు వాంగ్మూలం.. అది కూడా మెజిస్ట్రేట్ సమక్షంలో రంగయ్య ఇవ్వడం గమనార్హం. అయితే, రంగయ్య ఆరోపణలపై గంగిరెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి తనను చాలా బాగా చూసుకున్నారనీ, దేవుడి లాంటి వివేకానందరెడ్డిని తానెందుకు చంపుతాను’ అంటూ గంగిరెడ్డి అంటున్నారు. అసలు రంగయ్యతో తనకు పరిచయమే లేదని ఎర్ర గంగిరెడ్డి చెబుతున్నారు.
తనతో గంగిరెడ్డి చాలా విషయాలు మాట్లాడేవారనీ, ఇప్పుడు తానెవరో తెలియదని గంగిరెడ్డి అనడం హాస్యాస్పదంగా వుందని రంగయ్య ఎదురు దాడికి దిగుతున్నారు. అసలేం జరుగుతోంది వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ కేసులో.? ఏళ్ళ తరబడి నడుస్తోంది ఈ కేసు. వైఎస్ వివేకానందరెడ్డి మాజీ మంత్రి. పైగా, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత చిన్నాన్న. అలాంటి వివేకా దారుణ హత్యకు గురైతే, ఈ కేసులో దోషులెవరో తేలకపోవడం ఆశ్చర్యకరమే. ప్రస్తుతం కేసు విచారణ సీబీఐ చేతిలో వుంది. సీబీఐ సైతం ఈ కేసు విచారణలో నిజాలు నిగ్గు తేల్చలేకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికార వైసీపీ మీద టీడీపీ ఆరోపణలు, టీడీపీ మీద వైసీపీ ప్రత్యారోపణలు.. వెరసి, వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ.. ఓ ఫొలిటికల్ మిస్టరీని మించిపోయింది. ఈ కేసులో నిజానిజాలెప్పుడు తేలతాయోగానీ, ఈలోగా మీడియాలో రచ్చ మాత్రం కొనసాగుతూనే వుంది.