సునీతా రెడ్డితో చేతులు కలిపిన వైఎస్ షర్మిల.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి చేతులు కలిపారు. సునీతా రెడ్డితో భేటీ అయిన షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారం సహా, రాజకీయ అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలోకి సునీతా రెడ్డిని ఆహ్వానించి, ఎన్నికల బరిలో ఆమెను దింపేలా వైఎస్ షర్మిల రాజకీయ వ్యూహం రచిస్తున్నారట. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కడప ఎంపీ అభ్యర్థిగా సునీతా రెడ్డిని షర్మిల బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది.

మరోపక్క, పులివెందుల నుంచి సునీతా రెడ్డి, కడప ఎంపీ స్థానానికి షర్మిల పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయమై వైఎస్ షర్మిల ఇంతవరకు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

ఇదిలా వుంటే, సాక్షి మీడియాలో తనకూ వాటా వుందంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి తన వారసులిద్దరికీ సమాన వాటాలు ఇచ్చారు సాక్షి మీడియాలో. ఆ లెక్కన వైఎస్ జగన్‌తో సమానంగా నాకూ అందులో వాటా వుంది. కానీ, నా మీద సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోంది.. వ్యక్తిగత దూషణలకు దిగుతోంది..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.

2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా కోసం నినదించిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి బానిసగా మారిపోయారంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ మీద విమర్శలు, సాక్షిలో వాటాలపై కామెంట్లను పక్కన పెడితే, సునీతా రెడ్డితో షర్మిల భేటీ ఉమ్మడి కడప జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. సునీతా రెడ్డి ఎన్నికల బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.