అన్న వైఎస్ జగన్ నుంచి చెల్లెలు వైఎస్ షర్మిల ఏం ఆశించినట్టు.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఏం ఆశించినట్టు.? కడప ఎంపీ టిక్కెట్టేనా.? ఇంకేమైనానా.? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కడప ఎంపీ టిక్కెట్టు రగడ నేపథ్యంలోనే జరిగిందన్నది ప్రముఖంగా వినిపించిన, వినిపిస్తున్న వాదన. దాన్ని వైఎస్ షర్మిల గతంలోనే ధృవీకరించారు.

వైఎస్ షర్మిల లేదా తాను ఆ సీటు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు వైఎస్ వివేకానంద రెడ్డి బావించగా అది కుదరదని వైఎస్ జగన్ తేల్చేశారన్నది ప్రధాన ఆరోపణ. అటు బాబాయ్ వివేకానంద రెడ్డిని కాదని, ఇటు చెల్లెలు షర్మిలనీ కాదని.. కడప ఎంపీ టిక్కెట్టుని వైఎస్ అవినాశ్ రెడ్డికి ఇచ్చారుట వైఎస్ జగన్.

రాజకీయ పార్టీ అన్నాక సవాలక్ష ఈక్వేషన్లు వుంటాయ్. అన్న కోసం చెల్లెలు సుదీర్ఘ పాదయాత్ర చేసిన మాట వాస్తవం. మరి, అవినాశ్ రెడ్డి ఏం చేసినట్టు.? ఏమో, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలియాలి.

ఆ సంగతి పక్కన పెడితే, ‘నాకు మా అన్న అన్యాయం చేశాడు..’ అని షర్మిల వ్యాఖ్యానించారు. అంతేనా, ‘వైఎస్సార్ కుటుంబంలో చీలిక సాక్షాత్తూ వైఎస్ జగన్ పుణ్యమే’ అని కూడా వైఎస్ షర్మిల ఆరోపించడం గమనార్హం.

చెల్లెల్ని అన్న కాదనుకున్నారా.? అంటే, షర్మిల వ్యాఖ్యల్ని బట్టి అదే నిజమని అనుకోవాల్సి వస్తుంది. వైఎస్ విజయమ్మ దీనికి సాక్ష్యమట. షర్మిల కుండబద్దలుగొట్టేసిన వైనంతో జగన్ డిఫెన్స్‌లో పడిపోయినట్టే.

అయినా, ఇవన్నీ వైఎస్ షర్మిల ఇప్పుడే ఎందుకు చెబుతున్నట్లు.? గతంలో కాంగ్రెస్ తరఫున వైఎస్ వివేకా వకాల్తా పుచ్చుకున్నట్లు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తరఫున వకాల్తా పుచ్చుకుంటుండడం గమనార్హం. అంటే, వివేకా తరహాలోనే షర్మిలకీ ఏమైనా ప్రాణ గండం వుందా.? అంటూ సోషల్ మీడియాలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.