‘షర్మిల పెట్టబోయే పార్టీ.. ఆంధ్రా పార్టీ.. అలాంటి ఆంధ్రా పార్టీకి తెలంగాణలో ఏం పని.? సీఎం కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు షర్మిలకి లేదు.. తెలంగాణ ఉద్యమంలో పెద్దయెత్తున యువత ప్రాణాలు కోల్పోతే, అప్పుడెందుకు షర్మిల పెదవి విప్పలేదు.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో తెలంగాణ దోపిడీకి గురయ్యింది.. జలయజ్ఞం పేరుతో వైఎస్సార్ చేపట్టింది ధనయజ్ఞం..’ ఇలా బోల్డన్ని విమర్శలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచీ, కాంగ్రెస్, బీజేపీల నుంచీ షర్మిల పెట్టబోయే పార్టీపై షురూ అయ్యాయి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. మీడియా చర్చా కార్యక్రమాలకు స్టఫ్ వుండాలి గనుక, రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్ని ఆయా అంశాలపై ప్రశ్నిస్తే, అట్నుంచి స్పందనలు ఇలానే వుంటాయి. ఇప్పటివరకు షర్మిల పార్టీకి జెండా, ఎజెండా లేవు. అలాంటప్పుడు, ముందే తొందరపడి విమర్శలు చేయడం ఎంతవరకు సబబు.? అయితే, షర్మిల.. తన పార్టీ జెండా, ఎజెండా ఖరారు చేయకుండానే.. తెలంగాణలోని అధికార పార్టీపై విమర్శలు అత్యంత తీవ్రంగా చేసేశారు. దాంతో, అట్నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు రావడం సహజమే. కానీ, ఈ విమర్శల వల్ల షర్మిలకు పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది.. అదే సమయంలో అధికార పార్టీ, షర్మిల విషయమై స్పందిస్తే తన స్థాయిని తగ్గించుకున్నట్లవుతుంది.
జరుగుతున్న పరిణామాల్ని షర్మిల అనుచరులు జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారట. పెద్దయెత్తున జన సమీకరణ చేపట్టడం ద్వారా ఖమ్మం సభ విజయవంతం చేసుకోగలిగామనీ, అయితే ఆశించిన స్థాయిలో తెలంగాణ సమాజం నుంచి సరైన స్పందన రాలేదని నిన్నటి సభ తర్వాత షర్మిలకు ఓ రిపోర్ట్ అందిందనే ప్రచారం జరుగుతోంది. అయితే, పైకి మాత్రం షర్మిల సన్నిహితులు.. ఖమ్మం సభ అదిరిపోయిందనీ, తెలంగాణ సమాజం అంతా షర్మిల వెంట నడుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.