తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి పిలిచి, భోజనం పెట్టి, కౌగలించుకున్న కేసీయార్, నీటి వివాదం పరిష్కారం కోసం పిలిచి రెండు నిమిషాల పాటు చర్చించరెందుకని షర్మిల నిలదీశారు. యువత ప్రాణ త్యాగంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందనీ, కానీ, ఆ యువత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులుగా మారిపోతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణకు చెందిన ఒక్క నీటి బొట్టుని కూడా వదులుకోం. అలాగే, పొరుగు రాష్ట్రాలకు చెందిన ఒక్క నీటి బొట్టుపైనా ఆశపడబోం..’ అని షర్మిల పేర్కొన్నారు. అయితే, వైఎస్ జగన్ – కేసీయార్ మధ్య బంధం గురించి మాట్లాడుతూ, శతృవుని ఓడించడానికి ఇద్దరూ కలిశారు.. అని షర్మిల పేర్కొనడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆ ఉమ్మడి శతృవు ఎవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబే.
ఇక్కడ షర్మిల, చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? పైగా, టీడీపీ అనుకూల ఛానళ్ళు మాత్రమే పూర్తిస్థాయిలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు వ్యవహారాల్ని కవర్ చేస్తున్నాయి. ఈ రోజు వైఎస్సార్ జయంతి కాగా, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిలను కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగా.. ఇరువురూ వేర్వేరు సమయాల్లో పులివెందులలోని వైఎస్సార్ సమాధి వద్ద విడివిడిగా నివాళులర్పించారు. సరే, అన్నా చెల్లెలి మధ్య బేదాభిప్రాయాలనేవి టీ కప్పులో తుపానులాంటివేనని అనుకోవచ్చు. కానీ, ఇరు రాష్ట్రాల మధ్యా భగ్గముంటున్న నీటి వివాదం గురించి ప్రస్తావిస్తూ, చంద్రబాబు పేరుని పరోక్షంగా ఎందుకు షర్మిల తీసుకు రావాల్సి వచ్చింది.? ఈ సెటైర్ కేసీయార్ మీద మాత్రమే కాదు, జగన్ మీద కూడా అని అనుకోవాలేమో.