వెంటనే పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి.. ఇంటర్మీడియట్ పరీక్షల్ని కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి..’ అనే డిమాండ్ ఆంధ్రపదేశ్ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని విద్యార్థుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి.. విద్యా సంస్థలు ఎప్పుడో మూసివేశారు. కానీ, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించింది. విద్యార్థులకు పెద్దయెత్తున కరోనా సోకుతున్నా, నిర్లక్ష్యం వహించింది. చివరికి విద్యార్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు స్కూళ్ళకు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందిగానీ, పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో మొండి పట్టుదల కొనసాగిస్తోంది.
నిజానికి, పదో తరగతి పరీక్ష అత్యంత కీలకం. విద్యార్థులు నిద్రాహారాలు మానేసి మరీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. కానీ, అది ఒకప్పటి విషయం. కరోనా నేపథ్యంలో పరీక్షలు జరుగతాయో, జరగవోనన్న అనుమానంతో చాలామంది సరిగ్గా ప్రిపేర్ అవలేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మీద అనవసరమైన ఒత్తడి అవసరమా.? రేప్పొద్దున్న పరీక్షల కారణంగా విద్యార్థులకు కరోనా సోకితే, ప్రాణాలు పోతే.. బాధ్యత ఎవరు వహిస్తారు.? ఇంటర్మీడియట్ విద్యార్థులదీ ఇదే పరిస్థితి. ఇలాంటి విషయాల్లో నిర్ణయం తొందరగా తీసుకుంటే అది అందరికీ మంచిది.
ఓ పక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి కనీ వినీ ఎరుగని రీతిలో వ్యాప్తి చెందుతోంది. ఇంకోపక్క పరీక్షల రూపంలోనూ టెన్షన్ అనే మహమ్మారి ముంచుకొచ్చేస్తోంది. అయినా, ప్రభుత్వం, విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ప్రభుత్వానికి రావడం బాధాకరమే.