టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్.!

గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంప్రదాయాలకు తెరలేపుతూ, రికార్డు స్థాయిలో టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఆ ఉత్వర్వుల్ని రాష్ట్ర హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా టీటీడీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలు చేపట్టిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. నిజానికి, ఇలాంటి విషయాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘సలహాలు’ వక్రమార్గంలో వుంటుండడం వల్లే, ఇలాంటి నిర్ణయాల్లో ప్రతిసారీ జగన్ సర్కార్ ఎదురు దెబ్బ తినాల్సి వస్తోందన్నది మెజార్టీ అభిప్రాయం. గతంలో టీటీడీ రికార్డు స్థాయిలో సభ్యుల నియామకం చేపట్టింది. అప్పట్లోనూ పెద్దయెత్తున విమర్శలొచ్చాయి.

ఈసారి కాస్త తక్కువ సంఖ్యలో (గతంతో పోల్చితే) సభ్యుల నియామకం చేపట్టినా, ప్రత్యేక ఆహ్వానితుల జాబితా చాంతాడంత పెట్టింది. ఆ ప్రత్యేక ఆహ్వానితులకు టీటీడీ నిర్ణయాల విషయమై ఓటింగ్ అవకాశం వుండదంతే. మిగతా ప్రోటోకాల్ అంతా వర్తిస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తే, వారి ప్రోటోకాల్ కోసమే టీటీడీ చాలా కష్టపడాల్సి వస్తుంది. సామాన్య భక్తులకు దర్శనం కూడా గగనమైపోతుందన్న విమర్శలున్నాయి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి ఏంటి.? అన్న వాదన భక్తుల నుంచి ఎప్పటినుంచో వస్తోంది. పాలక మండలి అనేది చాలాకాలంగా నడుస్తున్న తంతు. అది రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రమైపోయిందన్న ఆరోపణల సంగతి సరే సరి.