అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారణ జరిపి వారికి శిక్ష పడేలా చేయాలని, నేరాలు రుజువైన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నిలబడకుండా జీవిత కాలం నిషేధం విధించాలనే డిమాండ్ ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి బీజేపీ తన ఎన్నికల హామీల్లో ప్రజాప్రతినిధుల మీదున్న నేరారోపణలను త్వరగా విచారించి రుజువైన వారికి శిక్ష పడేలా చేస్తామని అంది. కానీ మోదీ పదవి చేపట్టి ఇన్నేళ్ళు గడుస్తున్నా ఆ హామీ నెరవేరలేదు. ఇప్పుడు దాన్ని అమలుచేసి తీరాలని ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో పోరాడుతున్నారు. ప్రజాప్రతినిధుల మీదున్న కేసులను ఏళ్ల తరబడి సాగదీయకుండా త్వరితగతిన పూర్తిచేసి తీర్పు చెప్పాలని ఆయన పిటిషన్లో డిమాండ్ చేస్తున్నారు.
పిటిషన్ మీద సుప్రీంకోర్టు గతవారం కేంద్రానికి, దేశంలోని వివిధ హైకోర్టులకు తాఖీదులు జారీచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హైకోర్టులు, సీబీఐ తమ ముందు పెండింగ్లో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ విషయంపై సమగ్రంగా మాట్లాడిన ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతల గురించి తీవ్ర స్థాయిలో స్పందించారు. అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసులు, అవినీతి ఆరోపణలు వైఎస్ జగన్ మీద ఉన్నాయని, వాటి విచారణకు ఎక్కువ కాలం పట్టరాదని, ఏడాది కాలంలో విచారణ ముగిసి తీర్పు వెలువడాలని అంటూ లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితలకు శిక్ష పడటానికి ఎక్కువ సమయం పట్టిందని గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 55 శాతం మంది నేరచరితులని, వారిలో 57 శాతం మంది అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలేనని అనడం సంచలనంగా మారింది.
అసలు ఆంధ్రప్రదేశ్ నందు అవినీతి మరకలు లేని పోలీస్ స్టేషన్, జిల్లా ఒక్కటైనా ఉందా, ఎవరైనా చూపగలరా అంటూ అశ్వినీకుమార్ సవాల్ విసిరారు. ఆంధ్రాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని, మద్యం, ఇసుక, సిమెంట్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, శాసన సభలో అవినీతికి పాల్పడేవారు ఉండటం మూలంగానే ఈ అవినీతి జరుగుతోందని అంటూ అన్ని అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తవ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఎన్నుకున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడింది సాధారణమైన వ్యక్తి అయితే పర్లేదు కానీ అశ్వినీ కుమార్ లాంటి ప్రముఖ లాయర్, పిఐఎల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వ్యక్తి అందునా బీజేపీ అధికార ప్రతినిధి కావడంతో జగన్ మీదున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించి ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను, ఈడీ, సీబీఐ, మనీలాండరింగ్ సహా అనేక చట్టాల క్రింద నిందితులైన ప్రజా ప్రతినిధుల వివరాలను కోరింది.
మరి సుప్రీం కోర్టు రానున్న రోజుల్లో ఈ పిటిషన్ను ఎలా ముందుకు తీసుకెళుతుందో చూడాలి.