2019 ఎన్నికల్లో వైసీపీ యొక్క ధాటికి టీడీపీ చెందిన నాయకులందరు కుదేలైపోయారు కానీ టెక్కలి నియోజక వర్గంలో టీడీపీ జెండాను అచ్చెన్నాయుడు ఎగురవేశారు. టెక్కలిలో టీడీపీని దెబ్బతియ్యడానికి వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాలు పన్నారు. ఈ వ్యూహాలు ఏవి కూడా అచ్చెన్న విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు అచ్చెన్నను దెబ్బతియ్యడానికి వైసీపీ వేసిన వ్యూహం ఇప్పుడు వైసీపీకే ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆ ఇబ్బందుల వల్ల టెక్కలిలో వైసీపీ యొక్క ఉనికికే ప్రమాదం వచ్చింది.
2019 ఎన్నికల్లో వైసీపీ వేసిన వ్యూహం
టెక్కలిలో వైసీపీ తన జెండాను పాతడానికి, టీడీపీని దెబ్బతియ్యడానికి సామాజిక వర్గాల వారిగా పార్టీ యొక్క అధికారాలు కేటాయించారు. కాళింగ సామాజిక వర్గంలో సీటు కోసం పోటీ పడుతోన్న వారిలో దువ్వాడ శ్రీనుకు శ్రీకాకుళం ఎంపీ సీటు, పేరాడ తిలకకు టెక్కలి అసెంబ్లీ సీటు ఇచ్చారు.అయితే ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఓడిపోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు నేతలకు అస్సలు పడటం లేదు. వైసీపీ పెద్దలు పేరాడ తిలక్ ను కళింగ కార్పొరేషన్ చైర్మన్ ను చేశారు. దీంతో అందరూ కలిసి పనిచేసి అచ్చెన్న కు చెక్ పెడతారని అనుకున్నారు. అయితే దువ్వాడ, పేరాడ వర్గాలు రెండుగా చీలిపోయి కొట్లాటలకు దిగుతున్నాయి.వీరిద్దరు ఒకరి సభలకు మరొకరు ఆహ్వానించుకోవడం లేదు. కృపారాణి కూడా పేరాడతో చేతులు కలిపి దువ్వాడను వ్యతిరేకిస్తున్నారు. ఈ గొడవలు ఇప్పుడు టెక్కలిలో వైసీపీని దెబ్బతీసేలా ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా!!
ఈ ముగ్గురు నేతల మధ్య ఉన్న గోడవలను పరిష్కరించే బాధ్యతను సీఎం జగన్మోహన్ రెడ్డి విజయ్ సాయి రెడ్డికి అప్పగించారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ నేతలు మాట వినడం లేదు. దీంతో ఈ నాయకుల పట్ల జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని, వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి ఇబ్బందులు తెస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. మరి రానున్న రోజుల్లో ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయో వేచి చూడాలి.