2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాల నుండి తీవ్రమైన ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం జగన్ కు సొంత పార్టీ నేతల నుండి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే వైసీపీని బలహీనపరుస్తున్నారు. వ్యక్తిగతమైన గొడవల వల్ల పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఇప్పుడు వాళ్లకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. పార్టీకి నష్టం కలిగించే వాళ్ళను తాడేపల్లికి పిలిచి మరీ క్లాస్ పికుతున్నారు.
పార్టీ నేతల గొడవలకు చెక్ పెట్టిన జగన్
కొద్దికాలం క్రితం విశాఖ డీఆర్సీ మీటింగ్ లో పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాధ్, కరణం ధర్మశ్రీల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. డీఆర్సీ మీటింగ్ కావడంతో వెంటనే బయటకు పొక్కింది. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నేతల మధ్య వివాదానికి కారణమయ్యాయి. విశాఖకు పరిపాలన రాజధానిని తరలించాలనుకుంటే ఈ వివాదం జగన్ కు తలనొప్పిగా మారింది. వెంటనే తాడేపల్లికి నేతలను పిలిపించి క్లాస్ పీకి సెట్ చేశారు. తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య వివాదం జరిగింది. ఇది కూడా డీఆర్సీ సమావేశంలోనే జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం రచ్చ కెక్కింది. దీంతో జగన్ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ రెడ్డిని తాడేపల్లికి పిలిపించి గట్టిగా హెచ్చరించారని తెలిసింది. దీంతోనే బోస్ ద్వారంపూడి ఇంటికి వెళ్లి మరీ తమ మధ్య సయోధ్య ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా జగన్ ఈ వివాదాన్ని కూడా తొలిదశలోనే తుంచి వేయగలిగారు.
ఇప్పటికైనా ఈ గొడవలు తగ్గుతాయా!!
వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలోనే ఎక్కువ గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీ బలహీనపడిన విషయం కూడా తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఇప్పుడు పార్టీ ప్రక్షాళన చేపట్టారు. ఈ ప్రక్షాళన తరువాత అయినా వైసీపీ నేతల మధ్య గొడవలు తగ్గుతాయో లేదో వేచి చూడాలి.