ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన ఏపీలో ప్రారంభించే పథకాలు గానీ.. ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ… సాహసోపేతంగా ఉంటున్నాయి. అందుకే వేరే రాష్ట్రాలు కూడా సీఎం జగన్ పథకాలను ఫాలో అవుతున్నాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంతోనూ వైఎస్ జగన్ మంచి సంబంధాలు నెరుపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో మంచిగానే ఉంటున్నారు. కేంద్రం తీసుకొచ్చే బిల్లులకు మద్దతివ్వడం, కేంద్రంతో సత్సంబంధాలు నెరపడం లాంటివి చేస్తున్నారు. నిజానికి కేంద్రంతో ఏపీ ప్రభుత్వం మంచిగానే ఉండాలి. కొత్త రాష్ట్రం.. సరైన క్యాపిటల్ కూడా లేదు. రాష్ట్రం మొత్తం అప్పులమయం. ఈ నేపథ్యంలో కేంద్రంతో బాగా ఉంటేనే కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకుంటుంది. అందుకే సీఎం జగన్ కూడా కేంద్రంతో బాగానే ఉంటున్నారు.
ఇటీవల వైసీపీ వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ లో మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కూడా వైఎస్ జగన్ ను కొనియాడారు. ఆయన డైనమిగ్ సీఎం అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.
ఈనేపథ్యంలో వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చిన తర్వాత జరుగుతున్న భేటీ కావడంతో.. దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్తారు. సాయంత్రం అమిత్ షాతో భేటీ అవుతారు.
రాత్రి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. అనంతరం బుధవారం ఉదయం అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకుంటారు.