అమరావతికి శంఖుస్థాపన చేసిన మోదీ విశాఖకు వస్తారా ?

అమరావతికి శంఖుస్థాపన చేసిన మోదీ విశాఖకు వస్తారా
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో ఊహించడం కష్టం.  ఈరోజు రైట్ అనుకున్నది రేపు రాంగ్ కావొచ్చు.  ఇవాళ ఉంటుందని అనుకున్నది మరునాడు ఉండకపోవచ్చు.  ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఇదే.  గత ప్రభుత్వ హయాంలో అంగరంగ వైభవంగా మొదలైన అమరావతి ఇకపై పాక్షిక రాజధానిగా మాత్రమే ఉండనుంది.  చంద్రబాబు సర్కార్ ఈ నగరంపై వెచ్చించిన 10,000 కోట్లు వృథాగా పొనున్నాయి.  వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు మూలంగా అమరావతి కేవలం శాసన పరమైన రాజధానిగా మిగిలిపోనుంది.  ఇప్పటికే శాఖల తరలింపుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతుండగా హైకోర్టు స్టెటస్ కో ఇచ్చింది.  అయినా ప్రభుత్వం తమ పనుల్ని ఆపలేదు.  
 
 
విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ నెల 16న శంఖుస్థాపన జరపాలని నిర్ణయించారు.  ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు.  ఈమేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ లేఖ రాశారు.  అంతేకాదు పేదల ఇళ్ల పట్టాల పంపిణీలో కూడా మోదీని భాగస్వామిని చేయాలని జగన్ భావిస్తున్నారు.  అయితే మోదీ విశాఖ శంఖుస్థాపనకు వస్తారా అనేదే పెద్ద సందేహంగా మారింది.  కారణం గతంలో అమరావతి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మోదీ హాజరయ్యారు.  పుణ్య నదుల నుండి నీటిని  పవిత్రమైన మట్టిని అమరావతికి తీసుకొచ్చారు. 
 
 
ఆ నీటిని, మట్టిని బాబుగారు హెలికాప్టర్ మీద తిరుగుతూ అమరావతి మొత్తం చల్లి పెద్ద షో కూడా చేశారు.  ఆనాడు మోదీ సైతం అమరావతిని రాజధానిగా ఎంచుకోవడం మంచి నిర్ణయమని, నగర నిర్మాణానికి తమ సహకారం ఉంటుందని అన్నారు.  దాంతో మోదీ అమరావతికి కట్టుబడి ఉన్నారనే అభిప్రాయం ఏపీ జనంలో ఏర్పడింది.  అలాంటి మోదీ ఈరోజు అమరావతిని కాదని జగన్ కొత్తగా కడుతున్న విశాఖ శంఖుస్థాపనకు హాజరవడానికి సిద్దమవుతారా అనేది అనుమానంగా మారింది.  చాలామంది జగన్ ఆహ్వానాన్ని ప్రధాని అంగీకరించరని, పైగా కోవిడ్ దృష్ట్యా వెనక్కు తగ్గవచ్చని అంటుంటే ఇంకొంతమంది మాత్రం ఇప్పటికే ఏపీ రాజధాని తమ పరిధిలోని విషయం కాదని తేల్చేసిన దరిమిలా ప్రధాని హాజరయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు.  మరి ప్రధాని ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.