వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. నిత్యం మీడియా ముందు ఉంటూ వైఎస్ జగన్ తరపున ప్రత్యర్థులను ఏకిపారేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పసిగట్టి భూతద్దంలో పెట్టి దాని వలన రాష్ట్రమే నాశనమవుతుందన్నట్టు మాట్లాడతారు. ఒక్కోసారి ఆయన వాదనకు ఎవరైనా సర్దుకుపోవాల్సిందే. అసలు తమంతటి నిజాయితీపరులు ఇంకొకరు లేరన్నట్టు గొప్పలు చెబుతుంటారు. అలాంటి అంబటి మీదే ఈరోజు అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఎవరైనా ప్రత్యర్థి పార్టీ వారు చేస్తే ఏదో రాజకీయ ప్రతీకారం అనుకోవచ్చు. కానీ స్వయానా వైసీపీ కార్యకర్తలే ఆ ఆరోపణలు చేస్తే.
అంతకన్నా సంచలనం ఇంకొకటి ఉండదు కదా. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి, కుబాదుపురం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అదే గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు పప్పుల శ్రీనివాసరెడ్డి, నల్లగొర్ల రామయ్యలు హైకోర్టు లో పిల్ వేశారు. కానీ హైకోర్టు వైసీపీ కార్యకర్తలే వైకాపా మీద పిల్ వేస్తే అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని, అసలు దానికి విచారణార్హత ఉందా అని ప్రస్నించగా పిటిషనర్ల తరపు న్యాయవాది నాగరఘు వాదనలు వినిపిస్తూ కలెక్టర్ , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎంకు పిటిషన్లు పంపినా ఫలితం రాలేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణకు ఆదేశించినా విచారణ జరగలేదని అన్నారు.
అలాగే ఇప్పటికే మైనింగ్ అధికారులు దర్యాప్తులు చేశారని విన్నవించారు. దీంతో హైకోర్టు వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది. దీంతో అంబటి రాంబాబు ఇరుకునపడ్డట్టేనని అంటున్నారు. ఒకవేళ హైకోర్టు విచారణకు ఆదేశిస్తే అందులో అంబటి అక్రమ మైనింగ్ చేసినట్టు తేలితే ఆయనకు చిక్కులు తప్పవు. అలాగే విషయం తెలిసీ మౌనంగా ఉన్నారని, ఇది పార్టీ వ్యక్తులు చేసే అక్రమాలకు మద్దతు తెలపడమేననే చెడ్డపేరును వైఎస్ జగన్ మోయాల్సి ఉంటుంది. మొత్తానికి అంబటి తాను ఇరుక్కోవడమే కాక జగన్‌ను కూడా ఇరికించారే అంటున్నారు జనం.