ఇన్నాళ్లు సంక్షేమ పథకాల అమలు, పాలనా వ్యవహారాల్లో తలమునకలైన వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే పార్టీ పరిస్థితుల మీద దృష్టి పెడుతున్నారు. జగన్ ఇన్నాళ్లు పార్టీలోని నాయకులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గడిచిన ఏడాదిన్నర కాలంలో చాలా తతంగమే నడిచింది. చాలామంది నాయకులు గాడితప్పారు. ఎన్నికలకు ముందు జగన్ మాటను శిరోధార్యంగా భావించిన నేతలు ఇప్పుడు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మునుపు జగన్ ను నొప్పించే పని తమకు ఎంత ప్రయోజనం చేకూర్చేదైనా చేయడానికి వెనుకాడేవారు లీడర్లు. అయితే ఇప్పుడు మాత్రం జగన్ నొచ్చుకోవడం కాదు కదా కోపం తెచ్చుకున్న డోంట్ కేర్ అంటూ కావలసినట్టు వ్యవహరిస్తున్నారు.
దీంతో అంతర్గత విబేధాలు భగ్గుమబంటున్నాయి. ఈ విబేధాల కారణంగా కొందరు ఎంపీలు పక్క చూపులు చూస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. తమ ఆజ్ఞానుసారం నడుచుకోవలసిన ఎమ్మెల్యేలు తమ నెత్తినే ఎక్కుతున్నారని రగిలిపోతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఉన్న గొడవలు బాహాటంగానే బయటపడ్డాయి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజనీకి ఎప్పటి నుండో ఈగో సమస్యలు నడుస్తున్నాయి. ఎంపీ నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవికి గొడవలున్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మేకపాటి, వెమిరెడ్డిల డామినేషన్ తట్టుకుపోలేకపోతున్నారు.
వీటికి తోడు కొందరు ఎంపీలు సొంత పనులు చేసుకోవడానికి కూడ నానా తంటాలు పడాల్సి వస్తోంది. అధికారులేమో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఉంటున్నారు తప్ప ఎంపీలకు రెస్పాండ్ కావట్లేదట. నియోజకవరాగాల్లో బదిలీలు, పదవుల కేటాయింపులన్నీ ఎమ్మెల్యేల చేతుల మీదుగానే జరిగిపోతుండటం ఎంపీలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇక వ్యాపారాలున్న ఎంపీల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. వాళ్లంతా పెద్ద అండను వెతుక్కుంటున్నారట. వచ్చే ఎన్నికల్లోపు ప్రత్యామ్నాయం చూసి పెట్టుకుంటే బెటర్ అనే భావనలో ఉన్నారట. కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని టాక్. ఈ సంగతి జగన్ వరకు వెళ్లడంతో ఢిల్లీ లెవల్లో గట్టి నిఘా పెట్టారట. గూఢచారులను పెట్టి మరీ జగన్ గోడ దూకాలనుకుంటున్న ఎంపీలు ఎవరనేది ఆరా తీస్తున్నారట. ఈ వెతుకులాటలో జగన్ చేతికి దొరికితే మాత్రం సదరు ఎంపీలకు ట్రీట్మెంట్ మాములుగా ఉండదని అంటున్నాయి వైసీపీ వర్గాలు.