ఏపీ రాజధాని మార్పు అంశం రాజకీయ పార్టీల నడుమ యుద్ధం రేపింది కానీ ప్రజల్లో పెద్దగా కదలికను తీసుకురాలేకపోయింది. మెజారిటీ ప్రజలు రాజధాని ఉండాలే కానీ ఎక్కడుంటే ఏమిటి అంటున్నారు. గత ఐదేళ్లుగా రాజధాని లేకుండానే ముందుకు వెళ్లాం ఇప్పటికైనా ఏదో ఒక ప్రాంతాన్ని రాజధాని చేయమని అడుగుతున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది లేకుండానే ముందుకు వెళుతోంది. మూడు రాజధానుల విషయమై హైకోర్టు స్టే ఇచ్చింది కానీ లేకుంటే ఈపాటికి విశాఖ నుండి పాలన మొదలుపెట్టేవారు జగన్. పైగా రాజధాని వస్తున్నందుకు విశాఖ ప్రజలు సంతోషంగా ఉన్నారు. నాయపరమైన రాజధాని కానుండటంతో కర్నూలు జిల్లా జనం కూడ హ్యాపీయే.
కానీ కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలే కొంత అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ హవా ఎక్కువగా ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని కాదని ఆ మూడు జిల్లాల ఓటర్లు గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు. కృష్ణాలో రెండు చోట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాల్లో, గుంటూరులో రెండు సీట్లలో మాత్రమే టీడీపీ విజయం సాధించగలిగింది. మిగతావన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అందుకే అక్కడి ప్రజలు రాజధాని విషయంలో మిగతా జనం కంటే ఎక్కువగా నొచ్చుకుంటున్నారు. తరాల తరబడి ఆదరిస్తూ వచ్చిన టీడీపీని కాదని ఓట్లు వేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి మాకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షం టీడీపీ కూడ ఈ మూడు జిల్లాల ప్రజల మాటలను పట్టుకునే పోరాటం చేస్తోంది.
అందుకే జగన్ ఈ మూడు జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారట. అక్కడి జనంలో రాజధాని అసంతృప్తిని తగ్గించడానికి ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకుంటున్నారట. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడ గత ప్రభుత్వాలు చేయని రీతిలో ఏదో ఒక గొప్ప పని చేసి జనంలో అసంతృప్తిని తగ్గించాలని స్థానిక నేతలకు తెలిపారట. ప్రెజెంట్ అక్కడి నేతలు స్థానికంగా ఎలాంటి అవసరాలున్నాయో గుర్తించే పనిలో పడ్డారట. చూడబోతే రానున్న రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రభుత్వం నుండి ఏదో ఒక పెద్ద బహుమతే అందేలా ఉంది.