2019 ఎన్నికలకు ముందు జగన్‌ను నమ్మి పార్టీలో చేరిన నేతలు చాలామంది ఉన్నారు. గత 20 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడిని నమ్మనంతగా జగన్‌ను నమ్మారు చాలామంది. ఏళ్ల తరబడి ఉంటున్న పార్టీలను ఉన్నపళంగా వదిలేసి జగన్ వెంట నడిచారు వారంతా. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయించాలో అనేంత మంది నేతలు ఉండేవారక్కడ. పైగా వారిలో చాలామంది గెలుపు గుర్రాలే. టికెట్ ఇచ్చి పోటీలో నిలబెడితే తప్పకుండా నెగ్గుకొచ్చే సత్తా ఉన్నవారు ఒక్కో సీటుకు ఇద్దరు ముగ్గురు ఉండేవారు. వారికి తోడు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు పార్టీలో చేరిన కొత్త వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండేది.
అంతమందిలో సీటు ఎవరికి ఇవ్వాలో అనే విషయమై జగన్ చాలా కసరత్తు చేశారు. చివరికి ఆర్థిక బలం చూసి టికెట్లు కేటాయించాల్సి వచ్చింది. అలా ఆర్థిక అండదండలతో టికెట్ పొందిన వారిలో కొత్తవారే ఎక్కువ. చాలా ఏళ్లు జగన్ వెంట నడిచిన చాలామంది సీనియర్లు డబ్బు పెట్టే స్థోమత లేక వెనకడుగు వేయాల్సి వచ్చింది. వారందరికీ జగన్ ఎమ్మెల్సీ, వివిధ రకాల నామినేటెడ్ పోస్టుల హామీ ఇచ్చారు. ఆ హామీల మూలంగానే వారంతా కష్టంగా ఉన్నా కలిసి కట్టుగా పనిచేసి జగన్ ముక్కూ మొహం తెలియని చాలా మంది కొత్తవారిని గెలిపించారు. కానీ ఎన్నికలు ముగిసి పభుత్వం ఏర్పడి యేడాదిన్నర కావొస్తున్నా వారికెవరికీ హామీలు నెరవేరలేదు.
ఎదురుచూసి చూసి అలసిపోయిన నేతలందరూ ఇప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. పార్టీ కోసం టికెట్లు త్యాగాలు చేశాం, ఏళ్లకు ఏళ్లు కష్టపడి పనిచేశాం, ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇంకెప్పడు మాకు పదవులొచ్చేది హోదా ఏర్పడేది అంటున్నారు. పైపెచ్చు గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది వెనక నిలబడి పనిచేసిన తమను కనీసం పట్టించుకోవడం లేదని, తమ తరపున ఏ పనీ జరగడంలేదని వాపోతున్నారు. అసలు ఎన్నికలయ్యాక తమకు జగన్‌ను కలిసే అవకాశమే రాలేదని నొచ్చుకుంటున్న నేతలు అనేక మంది ఉన్నారు. వాళ్లందరినీ అలాగే వదిలేస్తే పార్టీకి కనిపించని నష్టం కలుగుతుంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. అందుకే జగన్ త్వరగా ఏదో ఒకటి చేసి వారందరినీ శాంతింపజేయడం మంచిది.