అధికార పక్షం మీద ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా లేవనెత్తే అంశం తమ పార్టీ గెలిచిన నియోజకవర్గాల మీద పాలక పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, మా నియోజకవర్గాల్లో అభివృద్ది పడకేసింది, ఉద్దేశ్యపూర్వకంగానే నిధులు మంజూరు చేయడం లేదు అని. నిజానికి గతంలో అధికార పార్టీలు కొన్ని ఇలాగే చేశాయి. తన పార్టీ గెలవని నియోజకవర్గాలను కావాలనే నిర్లక్ష్యం చేసేవారు. ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఎండగట్టేవారు. అప్పుడిక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కోపంతో వచ్చే ఎన్నికల్లో అయినా తమ పార్టీ వారిని గెలిపిస్తారనే ఆలోచన అది. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదే పదే తమ మీద కక్షగట్టారని అధికార వర్గాన్ని నిందిస్తుంటారు.
ప్రజెంట్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడ ఇదే పని చేస్తోంది. 151 స్థానాల్లో గెలిచిన జగన్ టీడీపీ ప్రానిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. జగన్ సైతం సంక్షేమ కార్యక్రమాల అమలులో బిజీగా ఉంటూ నియోజకవర్గాల వైపు చూడలేకపోతున్నారు. ప్రతి చోటా పింఛన్లు, అమ్మఒడి, రైతు బంధు, కాపు నేస్తం ఇలా సంక్షేమ పథకాలు అమలవుతున్న దాఖలాలు ఉన్నాయి కానీ ఎక్కడా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న ఆనవాళ్లు లేవు. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా చంద్రబాబు హయాయంలో నియోజకవర్గాల స్వరూపం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని చాలామంది అంటున్నారు.
ప్రతిపక్షం రోడ్డెక్కి ఈ మాటలు అంటుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎవరికి వారు లోపల లోపల ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపూ సంక్షేమ పథకాలు అమలుచేస్తూ కూర్చుంటే కొన్ని వర్గాలే సంతోషపడతాయి కానీ కొన్ని వర్గాలు మాత్రం ఖచ్చితంగా నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు సాగుతున్నాయా లేదా, కొత్త సౌకర్యాలు ఏం కల్పించారు, గత ప్రభుత్వానికి వీళ్లకి తేడా ఏమిటి అనే విషయాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి అభివృద్ది కంపల్సరీ అంటున్నారు. కనుక సీఎం ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో చెప్పినట్టు నియోజకవర్గాలకు ఏడాదికి కోటి రూపాయల అభివృద్ది నిధులు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇక నాడు- నేడు కింద నియోజవర్గాల రూపురేఖలు మార్చే ప్రక్రియ చేపడితే ప్రతిపక్షం సైతం జై జగన్ అనాల్సిందే కదా.