YS Jagan : త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందన్న ఆశాభావాన్ని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే, ‘ఆచార్య’ సినిమా విడుదల వాయిదా.. అనే ప్రకటన వచ్చింది. అంతలోనే, ‘ఏప్రిల్ 1న సినిమా విడుదల’ అంటూ ఇంకో ప్రకటన వచ్చింది.
ఏప్రిల్ 1 నాటికి కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గిపోతుందన్న నమ్మకం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాక మెగాస్టార్ చిరంజీవికి కలిగిందా.? ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా విడుదల కావాల్సి వుండగా, ఈలోగా థియేటర్ల సమస్యకు పరిష్కారం దొరకదని చిరంజీవి అర్థం చేసుకున్నారా.? ఏప్రిల్ 1 నాటికైనా సమస్య పరిష్కారమవుతుందా.? లేదా.?
చాలా ప్రశ్నలున్నాయ్. కానీ, సమాధానాలే దొరకడంలేదు. త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం రానుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేయగా, ‘చిరంజీవి వెళ్ళారంటే సమస్య పరిష్కారమవుతుంది..’ అని నాగార్జున ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
కానీ, అక్కడ మూమెంట్ చూస్తోంటే, వైఎస్ జగన్ సర్కారు సినిమా టిక్కెట్ల విషయంలో అస్సలేమాత్రం రాజీ పడేలా కనిపించడంలేదు. సామాన్యుడికి సినిమా అనే వినోదాన్ని అందుబాటులో వుంచేందుకు సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గిస్తున్నామని చెప్పిన జగన్ సర్కార్, ఆ మాటకే కట్టుబడి వుంది.
అయితే, మూడు రాజధానుల విషయంలోనూ, లిక్కర్ పాలసీ విషయంలోనూ, శాసన మండలి విషయంలోనూ వెనకడుగు వేసినట్లే, సినిమా టిక్కెట్ల విషయంలోనూ జగన్ సర్కారు వెనుకడుగు వేస్తుందనే చిన్న ఆశ అయితే సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏమో, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.