తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వరుస వివాదాలతో చర్చల్లో నిలుస్తున్నారు. ఇదివరకు పేకాట క్లబ్ విషయంలో, ఆతర్వాత సొంత పార్టీకి చెందిన నేతతో ఆర్థిక వివాదంతో వార్తల్లో నిలిచిన శ్రీదేవి కొత్తగా అంతకంటే పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఏకంగా ఒక సీఐని ఆమె దుర్భాషలాడుతున్నట్టు బయటికొచ్చిన ఆడియో టేప్ తీవ్ర సంచలనం రేపుతోంది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులను ఆరెస్ట్ చేసిన విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి సీఐ మీద విరుచుకుపడ్డట్టు ఆడియో టేపులోని మాటలున్నాయి. తన మాటను ధిక్కరించినందుకు సదరు ఎమ్మెల్యే ఉగ్రరూపం ప్రదర్శించినట్టు ఉన్నాయి ఆ మాటలు.
ఆడియో టేప్ నందు ‘ఎప్పటి నుంచి చెప్తున్నా.. వాళ్లను పంపేయొచ్చుగా. నీకేమైనా మెంటలా ? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశాను. నేనంటే గౌరవం లేదా. మా వాళ్లని వదలిపెట్టవా. నాన్సెన్స్.. నువ్వు పంపిస్తావా లేదా. నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావ్. ఇప్పుడు ఎమ్మెల్యేనని చూడకుండా ఓ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నావ్. నేను తలచుకుంటే రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్. ఎక్స్‌ట్రాలు చేయొద్దు. వారిని వదిలిపెట్టు’ అనే మాటలున్నాయి. సీఐ వారిని వదలడం ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే వినిపించుకోలేదన్నట్టు సంభాషణ ఉంది. ఇది ప్రత్యర్థి పార్టీలకు పెద్ద అవకాశమైంది. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నది వైసీపీ నేతల మనుషులేనని, వారిని ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా కాపాడుతున్నారని విమర్శిస్తున్నారు.
గతంలో కూడ ఇసుక విషయంలో వైసీపీ నేతల మీద అక్రమ అమ్మకాలకు పాల్పడినట్టు అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. జనంలో సైతం ఇసుక వ్యవహరంలో వైసీపీ తీరు సరిగా లేదనే భావన ఉంది. వాటికి ఈ తాజా ఫోన్ సంభాషణ మరింత బలాన్ని చేకూర్చింది. ఈ పరిణామం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చినట్టే. అన్ని వైపుల నుండి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అధినేత జగన్ సైతం అప్సెట్ అయ్యారట. పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను అంత తేలికగా వదలకూడదని భావించిన ఆయన అసలు జరిగిన విషయమేటి, ఆడియో టేపులో నిజమెంత అనేది విచారించి తెలుసుకోమని చెప్పినట్టు సమాచారం.