తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీతో అంటకాగుతున్న సంగతి తెలిసిందే. జగన్ సైతం చాలా తెలివిగా ఆ నలుగురిని పార్టీలో చేర్చుకోకుండా వారి కుటుంబ సభ్యులను చేర్చుకుని ఫిరాయింపుల ప్రోత్సాహం అనే మచ్చ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. టీడీపీని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు వెల్లడమైతే జగన్ వైపుకు వెళ్లారు కానీ వారి పరిస్థితి నియోజకవర్గాల్లో అంత వైభవంగా ఏమీ లేదట. ప్రధానంగా వైసీపీ నేతల నుండి ఆధిపత్య పోరు ఎదురవుతోందట. వైసీపీ క్యాడర్ సైతం వారిని గుర్తించట్లేదట. దీంతో టీడీపీకి పూర్తిగా దూరమై వైసీపీకి తోకల్లా మిగిలిపోతున్నామనే దిగులు పట్టుకుంది వారికి.
అందుకే అధికార పార్టీలో అధికారికంగా కలిసిపోతే తాము కూడ ప్రభుత్వంలో భాగమైపోతామని, అధికారికంగా వైసీపీ సభ్యత్వం ఉంటుంది కాబట్టి దర్జాగా మంత్రి పదవులకు పోటీపడవచ్చని, ఇవన్నీ జరగాలంటే ఉపఎన్నికలు ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చారట కొందరు. అందుకే గెలిచిన చోటే రాజీనామాలు చేసి ఉపఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుస్తామని అంటున్నారట. ఉపఎన్నికల్లో తమకే వైసీపీ తరపున తమకే టికెట్ ఇస్తానని, నియోజకవర్గ వైసీపీ నేతలంతా తమ గెలుపుకు కృషి చేసేలా చూసుకుంటానని జగన్ హామీలు ఇస్తే వెంటనే రాజీనామాలు సమర్పిస్తామని జగన్ వద్దకు సందేశాలు పంపుతున్నారట.
కానీ జగన్ మాత్రం ఉపఎన్నికలకు వెళ్ళాయానికి సుముఖంగా లేరని టాక్. ఎందుకంటే ఇప్పటికే వారి రాకతో ఆయా నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలను, శ్రేణులను సముదాయించలేక ఇబ్బందుకు పడుతున్నారు సీఎం. ఇప్పుడిక ఉపఎన్నికలు పెట్టి ఫిరాయింపుదారులకు టికెట్లు ఇస్తే పూర్తిగా తమకు పక్కనపెట్టేశారనే భావనలోకి వెళ్ళిపోతారు పాత నేతలు. ఇది పార్టీని బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఒకవేళ టైమ్ బాగోలేక తాను టికెట్లు ఇచ్చిన వారు ఓడిపోతే పార్టీ ప్రతిష్టకు పెద్ద దెబ్బ తగులుతుందని, జనంలో నవ్వులపాలు కావాల్సి వస్తుందని, కనుక ఉత్సాహం తగ్గించుకుని ఉపఎన్నికలనే ఆలోచన విరమించుకోమని జగన్ ఆ ఎమ్మెల్యేలకు చెబుతున్నారట.