Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయనకు రావలసిన జీతంతో పాటు ఇతర అలవెన్స్లను ఏమాత్రం తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇటీవల శాసనసభలో వైసిపి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వారికి వచ్చే జీతభత్యాలు తీసుకుంటున్న సరే సభకు హాజరు కావడం లేదనే విషయంపై చర్చలు జరిగాయి.
సభకు రాకుండా జీతాలు తీసుకోని ఎమ్మెల్యేల విషయం చర్చించేందుకు ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు. ఈ విషయంపై శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యత ఉందని సభకు రావాలని అన్నారు. ప్రభుత్వం తరఫున జీతాలు తీసుకుంటున్న వారు సభకు ఎందుకు రారు అని ఆయన అన్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జీతం తీసుకుంటున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అంటూ స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదని అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్స్లు కూడా తీసుకోవడంలేదని సభా వేదికగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలియచేయడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదు ఆయన గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేవలం ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు.
సాధారణంగా ముఖ్యమంత్రి కి మూడున్నర లక్ష జీతంతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి కానీ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ కూడా జీతం అందుకోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నుంచి 57 లక్షల రూపాయల వరకు జీతం తీసుకొని ఒకరోజు కూడా సభకు రాలేదు అంటూ ఇటీవల రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. జగన్ మాత్రం సభకు హాజరు కాకపోయినా ఆయన అందుకోవాల్సిన జీతభత్యాలు కూడా తీసుకోవటం లేదని తెలుస్తోంది.