వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని మొత్తం జిల్లాలను 25 జిల్లాలుగా విభజించనున్నారు. దీని కోసం వైసీపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. జిల్లాల విభజన కోసం ప్రభుత్వం అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి… మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిచింది. ఇప్పుడు వినాయకచవితి రోజు సెలవు అయినప్పటికీ సబ్ కమిటీలు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రస్థాయి కమిటీకి ప్రత్యేక ఉప సంఘాలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం ఓ కమిటీకి, సిబ్బంది పునర్విభజన అధ్యయనం మరో కమిటీకి, ఆస్తులు, మౌలిక సదుపాయాలపై మరో కమిటీ, సాంకేతిక సంబంధిత అవసరాల అధ్యయనానికి మరో కమిటీని ఏర్పాటు చేశారు.
ఇక సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి .. అలాగే ఇతర అంశాలపై ఏర్పాటైన నాలుగు సబ్ కమిటీలకు సాయం చేసేందుకు.. జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీని నియమించారు. అలాగే.. సీఎస్ నేతృత్వంలోని కమిటీకి..ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం… పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు చేయాల్సి ఉంది.
ఇలా 13జిల్లాలకు 13 కమిటీలను ఏర్పాటు చేయడంతో మరో ఐదు అదనపు కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా జిల్లాల విభజన కోసం మొత్తం 18కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాల విభజన విషయంలో కొంతమంది ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ అసంతృప్తిని తొలగించేలా జిల్లాలు ఏర్పాటు చేయడానికే జగన్ ఇన్ని కమిటీలను ఏర్పాటు చేశారని వైసీపీ నాయకులు చెప్తున్నారు.