జన సంద్రమైన కుప్పం!

జనాన్ని సమీకరించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో కనిపించిన జనమే అందుకు నిదర్శనం. కానీ, అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో వైఎస్ జగన్ ప్రసంగాల్లో పస వుండేది. కానీ, ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్ ప్రసంగాల్లో తడబాటు కనిపిస్తోంది.

వైఎస్ జగన్ బహిరంగ సభలకు జనాన్ని ఇటు ప్రభుత్వ పరంగా, అటు పార్టీ పరంగా.. ఇలా రెండు కోణాల్లో తరలించేందుకు ఇప్పుడు అదనపు వెసులుబాటు కనిపించినా, తన ప్రసంగాలతో జనాన్ని కట్టిపడేయలేకపోతున్నారు సీఎం వైఎస్ జగన్.

తాజాగా వైఎస్ జగన్, కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. అధికారిక పర్యటనే ఇది. కానీ, స్థానిక ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరయ్యే పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

కుప్పం బాధ్యతల్ని యువనేత భరత్‌కి అప్పగించిన వైఎస్ జగన్, గెలిస్తే మంత్రిని చేస్తానని ఇప్పటికే  హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘కుప్పంలో అభివృద్ధి అంటూ జరిగితే అది తమ హయాంలోనే’ అంటున్నారు వైఎస్ జగన్. అదే మాట కుప్పం పర్యటనలోనూ వైఎస్ జగన్ చెప్పనున్నారు.

కుప్పంలో ప్రతిపక్షంపై వైఎస్ జగన్ వేయబోయే సెటైర్లు ఎలా వుంటాయన్న ఉత్కంఠ అందరిలోనూ వుంది. మరోపక్క, వైఎస్ జగన్ కుప్పం పర్యటన కోసం చేసిన ఏర్పాట్లు స్థానికంగా ప్రజల్లో కొంత అసహనానికి కారణమవుతున్నాయి. అయినాగానీ, పెద్దయెత్తున్న కుప్పం చేరుకున్నారు జనం. ఇతర ప్రాంతాల నుంచీ పెద్దయెత్తున జనాన్ని తరలించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కుప్పంలో కనీ వినీ ఎరుగని రీతిలో జన సంద్రం కనిపిస్తోంది.