కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి అతి పెద్ద పరాభవాన్ని చవిచూశారు. సిట్టింగ్ స్థానం దుబ్బాకలో బీజేపీ చేతిలో ఓటమిని చవిచూశారు. గతంలో కుమార్తె కవిత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోవడం కంటే ఇది పెద్ద ఓటమి అంటున్నారు జనం. కీలక నేత హరీష్ రావు క్యాంప్ ఏర్పాటుచేసుకుని పర్యవేక్షించినా నెగ్గలేకపోయారు. ఈ ఓటమికి ప్రధాన కారణం బీజేపీ మీద కేసీఆర్ కత్తిగట్టడమే. అసలు ఎలక్షన్లకు పది రోజుల ముందు బీజేపీ గెలుపు ఓటర్ల చర్చల్లో అసలు లేనే లేదు. కానీ ప్రభుత్వం వారిని టార్గెట్ చేయడమే వారి గెలుపుకు కారణమైంది. బీజేపీ అభ్యర్థి మనుషుల వద్ద డబ్బులు దొరికాయని ఆరోపణలు రావడం, బండి సంజయ్ దీక్ష వంటి విషయాలు జనం దృష్టిని బీజేపీ మీద పడేలా చేశాయి.
ఆరోపణలు, ప్రత్యారోపణలు, దీక్షలు, నిరసనలు, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఊహించని విధంగా తిరగబడటంతో బీజేపీ బాగా హైలెట్ అయింది.. ఎంతలా అంటే తెరాసకు పోటీ బీజేపీయే అనేంతలా. ఈ మార్పే బీజేపీకి మైలేజ్ వచ్చేలా చేసింది. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ కలిసి బీజేపీని ఒంటరిని చేశారనే భావన తెరాస అభ్యర్థి మీద పనిచేయాల్సిన సానుభూతిని బీజేపీ అభ్యర్థి రఘునందన్ మీదకి మళ్లింది. ఈ పరిణామాన్ని జగన్ ముందుగానే పసిగట్టారు. అందుకే బీజేపీని నిర్లక్ష్యం చేశారు. మొదటి నుండి బీజేపీ వైసీపీని కవ్విస్తూనే ఉంది. వివిధ అంశాల్లో వైసీపీ విధానాలను తప్పుబడుతూ రెచ్చగొట్టాలని చూసింది. చివరికి మతం కార్డును కూడ వాడుకుంది. అయినా జగన్ ఒక్క మాట మాట్లాడలేదు. ఒకరిద్దరు వైసీపీ నేతలే మాట్లాడారు.
తిరుమల డిక్లరేషన్ విషయంలో నానాయాగీ చేసినా జగన్ పట్టించుకోలేదు. అందుకే జనం సైతం బీజేపీ చేస్తున్న ఆగిత్తాన్ని లెక్కచేయలేదు. ఫలితంగా బీజేపీ ఆశించిన పబ్లిసిటీ రాలేదు. ఎందుకంటే తాను కలుగజేసుకుని మాట్లాడితే అవతలి వ్యక్తిని పెద్దవాడిని చేసినట్టు అవుతుందని జగన్ కు తెలుసు. కాబట్టే మాట్లాడలేదు. నిరసనలు చేసినా పోలీసులు అడ్డుకున్నారే తప్ప అరెస్ట్ చేయలేదు. కానీ కేసీర్ అన్నీ విరుద్దంగానే చేశారు. బీజేపీ మీదకి హరీష్ రావును, పోలీస్ యంత్రాగాన్ని ప్రయోగించి చివరికి ఓడిపోయే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు.