ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడెక్కడ.?

ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ.? ఆ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పుడు కనిపించడంలేదేం.? కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన జగన్ ఇప్పుడేమయ్యారు.? ఇలా వైసీపీలోనే అంతర్గతంగా చాలా చర్చ జరుగుతోంది. కానీ, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బాహాటంగా ప్రశ్నించే ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదు.

అధికారం లేకపోతే నిప్పు కణం.. అధికారం చేతిలో వుంటే.. పూర్తి సంయమనం.! ఎందుకిలా.? సంయమనం చేతకానితనంగా మారిపోతున్న వైనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు గుర్తెరగడంలేదన్న ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెబుతారో ఏమో.!

ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కావొచ్చు.. విభజన చట్టానికి సంబంధించిన చాలా అంశాల్లో కావొచ్చు, రాష్ట్రానికి కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల వాటా విషయంలో కావొచ్చు.. కేంద్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నిలదీయలేకపోతున్నారు.

‘బహుశా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అడ్డంకిగా మారిందేమో.! ఆ పదవి లేకపోతే మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మునుపటి సింహాన్ని చూడగలుగుతామేమో..’ అని వైసీపీ నాయకులే ఆఫ్ ద రికార్డుగా వ్యాఖ్యానిస్తోన్న పరిస్థితి.

అంటే, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలేమో.? అన్న భావన జనంలో రాకముందే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేల్కొనాల్సి వుంది. శాసన మండలి రద్దు, న్యాయ రాజధాని, దిశ చట్టం.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా అంశాల్లో వైసీపీ సర్కారుకి కేంద్రం మోకాలడ్డుతోన్న విషయం విదితమే.

అయినాగానీ, కేంద్రానికి ‘సమర్పించేసుకుంటాం’ అనే రీతిలోనే వైసీపీ వ్యవహరిస్తుండడం వల్ల, వైసీపీ రాష్ట్ర ప్రజల్లో నానాటికీ పలచనైపోతున్నమాట వాస్తవం. ఈ శక్తి హీనత ముందు, ఎంతటి సంక్షేమమైనా వృధానే.!