దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ఒక మాట చెప్పే వారు. మాట తప్పడం మడమ తిప్పడం మా వంశంలో లేదని. చంద్ర బాబుని విమర్శించడానికి రాజశేఖర్ రెడ్డి తరచుగా ఈ మాట వాడేవారు. అయన మరణాంతరం అయన పేరు మీద వైయస్ జగన్ ” వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ” అనే పార్టీని స్థాపించారు. జగన్మోహన్ రెడ్డిని అయన పార్టీ నాయకులు పొగుడుతూ చెప్పే మాట ” మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి లాగానే మాట తప్పడు మడమ తిప్పడు” అని.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొని, వారిలో కొందరకి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతు, చంద్రబాబు అంత దిగజారుడు రాజకీయ నాయకుడు మరొకరు ఈ దేశంలో లేరని, వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవాలంటే వారి చేత రాజీనామా చేయించి మళ్ళీ టీడీపీ టికెట్ మీద గెలిపించుకోవాలని చెప్పేవారు. అలాగే తమ పార్టీలోకి ఎవరన్నా రావాలన్న వారి పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పేవారు.
ప్రతిపక్షంలో ఉండగా ఆ సిద్ధాంతానికి కట్టుబడే కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్ప చక్రపాణి రెడ్డి వైసీపీ లోకి రావాలనుకున్నప్పుడు, అయన చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్నారు. అప్పట్లో విమర్శకులు, సామాన్య ప్రజానీకం కూడా వైయస్ జగన్ చేసిన పనిని మెచ్చుకున్నారు కూడా. కాలం గిర్రున తిరిగింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో వైయస్ జగన్ అన్న మాట ” ఎవరైనా వైసీపీ లోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే, ఫిరాయింపులను మేము ప్రోత్సహించము” అని.
కొన్నాళ్లు ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఎంతో మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి రావడానికి ఉత్సహం చూపిన వైయస్ జగన్ వారిని తీసుకోలేదు. అయితే రాజధాని వివాదం మొదలైన తర్వాత చంద్రబాబుని మానసికంగా దెబ్బతీయాలనుకున్నారేమో, ఒక కొత్త పద్దతిలో ఫిరాయింపులు ప్రారంభించారు. మొదటి రకం, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలుస్తారు, పార్టీ కండువా వేసుకోరు కానీ ముఖ్యమంత్రి కి మద్దతు పలుకుతారు. అసెంబ్లీలో వేరుగా కూర్చుంటారు. ఈ కోవలోకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి వస్తారు. ఇక రెండో రకం, ఎమ్మెల్యే కండువా కప్పుకోరు కానీ వారి తనయులు మాత్రం వైసీపీ లో చేరతారు, ఎమ్మెల్యేలు వైయస్ జగన్ కు మద్దతుగా మాట్లాడతారు. ఈ కోవలోకి కరణం బలరామకృష్ణ మూర్తి, తాజా వైసీపీకి మద్దతు ప్రకటించిన వాసుపల్లి గణేష్ వస్తారు. ఇక మూడవ రకం నేరుగా పదవి ఉండగానే పార్టీ లో చేరుతారు.ఈ కోవలోకి పోతుల సునీత వస్తారు. ఆమె తన పదవికి రాజీనామా చెయ్యకుండా వైసీపీ లో చేరేసింది. ఇవ్వన్నీ చూస్తే వైయస్ జగన్ తన సిద్ధాంతానికి తానే తూట్లు పొడిచినట్టు కనిపిస్తుంది.
మీ పార్టీ ప్రతిపక్షంలో వున్నపుడు మీ పార్టీలో ఎవరు చేరేవాళ్ళు లేనప్పుడు మీరు సిద్ధాంతానికి కట్టుబడడం గొప్ప విషయమేమి కాదు . కానీ మీకు అధికారం వచ్చి మీ పార్టీలోకి అనేకమంది వస్తామని అంటున్నా మీరు సిద్ధాంతానికి కట్టుబడి వారిని రాజీనామా చేసిన తర్వాత పార్టీ లోకి తీసుకొని ఉంటే అది కచ్చితంగా ఒక గొప్ప విజయం గా వైయస్ జగన్ ఇన్నాళ్లు చెప్పిన మాటలకు నిజమైన గౌరం లభించేది. ఇలా డొంకతిరుగుడుగా ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడంవలన చంద్రబాబు చేసినదానికి వైయస్ జగన్ చేసినదానికి సాంకేతికంగా తేడా ఉండొచ్చేమో కానీ నైతికంగా రెండు ఒకటే. అది మడమ తిప్పడం కిందకే వస్తుంది.