పెట్రో ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కాస్త అదనపు బాదుడు చంద్రబాబు హయాం నుంచే కొనసాగుతున్న దరిమిలా, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పెట్రో ధరలు ఎక్కువే. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో, ‘ఏపీ కంటే మా రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ.. అంటూ ధరల పట్టికలు’ కూడా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా ఓ లెక్క.. ఇప్పుడు పెట్రోల్ ధర సెంచరీ కొట్టేశాక ఇంకో లెక్క. విపక్షాలు అధికార వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్ర పన్నుల్ని తగ్గించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
నిజానికి, వివిధ రకాల సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న వైఎస్ జగన్ సర్కార్, పెట్రో దరల కారణంగా ప్రజల వచ్చే నెగెటివిటీని కోరుకుంటుందా.? కానీ, రాష్ట్రం వున్న ఆర్థిక పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం అవసరమే. అందుకే, పెట్రో ధరలకు సంబంధించి రాష్ట్ర పన్నుల తగ్గింపుపై మల్లగుల్లాలు పడుతోంది వైఎస్ జగన్ సర్కార్. అయితే, ఇంకా ఈ ధరలు పెరుగుతూ పోతే, ఖచ్చితంగా అది ప్రభుత్వ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యే అవకాశాల్లేకపోలేదు.
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. సెంచరీ బ్యాట్స్ మెన్ వైఎస్ జగన్.. అంటూ టీడీపీ సహా వివిధ పార్టీలకు చెందిన నెటిజన్లు మీమ్స్ రూపొందిస్తున్నారు. మరోపక్క, మోడీ సర్కారుకి సైతం పెట్రో సెగ గట్టిగానే తగులుతోంది. దేశవ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు పెట్రో ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకి కూడా ఆ సెగ గట్టిగానే తగులుతోంది.