దేశంలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం వైఎస్ జగన్ చేశారు. ఎంతో రిస్క్ అని తెలిసి కూడ ముందుకు దూకారు. సాధారణంగా వేరే ముఖ్యమంత్రులు ఎవరైనా సుప్రీం కోర్ట్ జస్టిస్ విషయంలో ఇలా ప్రధాన న్యాయమూర్తికి ఆరోపణలు చేస్తూ లేఖ రాస్తే మరీ ఇంత స్థాయిలో హీట్ పెరిగేది కాదు. కానీ వ్యక్తిగతంగా కొన్ని వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ సీఎం హోదాలో న్యాయవ్యవస్థ మీద తీవ్ర ఆరోపణలకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్ చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టవచ్చు. నిజానికి జగన్ చేసిన ఆరోపణల్లో కొన్ని వింతండంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కోర్టులను మేనేజ్ చేస్తున్నాడని అనడం, జస్టిస్ ఎన్వీ రమణ తన పలుకుబడితో తన ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర చేస్తున్నారని అనడం లాంటివి.
అసలు 151 మంది ఎమ్మెల్యేలున్న జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అంత సులభమా అనేది చాలామంది ప్రశ్న. రంగుల జీవో, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇంగ్లీషు మీడియం లాంటి విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం ఖాయమని సామాన్యుడు కూడ ఊహించగలిగాడు. అలాంటిది ప్రభుత్వం ఊహించలేదని అనుకోలేం. ఊహించి కూడ కోర్టుకు, పైకోర్టుకు వెళ్లారంటే ఏమనాలి. ఇలా జగన్ వైపున కొన్ని లోపాల్ని పసిగట్టవచ్చు. దాన్ని దాటి ముందుకు ఆలోచిస్తే జగన్ వేసిన స్టెప్ న్యాయవ్యవస్థ మీద ఏ స్థాయి ప్రభావం చూపుతుంది, ఎలాంటి మార్పులకు నాంది పలకబోతోంది అనేది అర్థమవుతుంది. అవి అర్థమైతే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించకుండా ఉండలేం.
న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని ఆరోపించిన మొట్టమొదటి వ్యక్తి జగనే కాదు. అంతకుముందు కూడా పలువురు ప్రముఖులు న్యాయవ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయని బాహాటంగా చర్చకు కూర్చున్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ చలమేశ్వర్ లాంటి వ్యక్తులు మీడియా ముందుకొచ్చి న్యాయవ్యవస్థ పనితీరును తీవ్రంగా దుయ్యబట్టారు. వ్యవస్థలో ఏదీ సిస్టమ్ ప్రకారం నడవట్లేదని, బెంచెస్ మేనేజ్ చేయబడుతున్నాయని అన్నారు. కానీ ఎందుకో వారి వ్యాఖ్యలు చాలా త్వరగానే చల్లబడిపోయాయి. జాతీయ మీడియా సైతం వారి మాటలను మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. అంతెందుకు గతంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అయితే చాలామంది చీఫ్ జస్టిస్ లు అవినీతిమయమయ్యారని ఆరోపించారు.
వారంతా సుప్రీం కోర్టు గురించి చెబితే ఇక్కడ జగన్ హైకోర్టు గురించి చెబుతున్నారు. అత్యున్నత న్యాయంస్థానమైన సుప్రీం కోర్టులోనే లోపాలున్నాయనే ఆరోపణలు వచ్చాయంటే హైకోర్టులో ఆ లోపాలు లేవని, జగన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవని ఎలా అనుకోగలం. అందుకే ఆయన ఆరోపణలను తీవ్రంగా పరిగణించి పరిశీలన జరిపితే నిజానిజాలు బయటికొస్తాయి. అప్పుడు జగన్ చెబుతున్నట్టు నిజంగానే తప్పులు బయటపడితే వాటిని సరిచేసుకోవడానికి తగిన సంస్కరణలను న్యాయవ్యస్థలో తక్షణమే తీసుకురావచ్చు. అదే జరిగితే న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు మూలకారణమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురించి దేశం ఇంకో పదేళ్లు మాట్లాడుకుంటుందనడంలో సందేహమేమీ లేదు.