YS Jagan Delhi Tour : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాతో మొదలుకొని పదుల సంఖ్యలో కీలక అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొరపెట్టుకున్నట్టు అధికార వైసీపీ చెబుతున్నదాన్ని బట్టి అర్థమవుతోంది. ప్రధానితో ఏయే అంశాలపై వైఎస్ జగన్ చర్చించారన్నదానిపై ఎప్పటికప్పుడు అధికారికంగా ఓ వివరణ వైఎస్ జగన్ సర్కారు నుంచి వస్తుంటుంది.
అయితే, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయినప్పుడు, ఆ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా రాష్ట్రానికి సంబంధించి ఏయే అంశాలపై చర్చలు జరిగాయో, వాటి పట్ల కేంద్రం స్పందన ఏంటో.. కేంద్ర ప్రభుత్వ పెద్దలూ ముఖ్యమంత్రితో కలిసి మీడియా ముందుకు వస్తే అది హుందాతనంగా వుంటుంది. అన్ని సందర్భాల్లో కాకపోయినా, అప్పుడప్పుడూ అయినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ పంధా అనుసరిస్తే మంచిది.
చంద్రబాబు హయాంలో పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మీడియా ముందుకొచ్చేవారు. అప్పట్లో టీడీపీ – బీజేపీ మిత్రపక్షాలుగా వున్న దరిమిలా, కేంద్ర మంత్రులు ఉత్సాహంగా వచ్చి వుంటారేమో. కానీ, అది ఓ బాధ్యత.
ప్రత్యేక హోదా, ప్రత్యక రైల్వే జోన్, రాజధాని అంశం, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. ఇవన్నీ కేంద్రం చేయాల్సినవే. వీటి గురించి అడుగుతూనే వున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలోనూ ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే వుంటాయి. వాటిపై కేంద్రం, రాష్ట్ర ప్రజలకు సమాధానమివ్వాలి కదా.? ఇవ్వడంలేదంటే దానర్థమేంటి.?
రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తమను ఆదుకోవాలని ప్రధానిని తాజాగా ముఖ్యమంత్రి కోరారన్న ప్రచారం జరుగుతోంది. మరి, ఏపీని ఆదుకునేందుకు ఈసారైనా ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందిస్తారా.? స్పందించరా.? వేచి చూడాల్సిందే.