YS Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలో వున్నా, డిల్లీ పెద్దల తీరు ఒకేలా వుంటోంది. టీడీపీ – బీజేపీ పొత్తులో వున్నప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లో పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీకి వెళితే, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరకని సందర్భాలున్నాయి.
అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళితే, కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్లు దొరకడం గగనంగా కనిపిస్తోంది. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికినా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తుల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడంలేదు.
తాజాగా మరోమారు వైఎస్ జగన్ ఢిల్లీ టూర్.. అంటూ హంగామా నడుస్తోంది. ప్రత్యేక హోదాతో మొదలుపెడితే, అనేక అంశాల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందుంచడం మామూలే. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ సమయంలోనూ ఈ అంశాల్ని ఏపీ సీఎం జగన్ ప్రస్తావించబోతున్నారట. కానీ, దాని వల్ల ఒరిగేదేంటి.?
పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రం మొండి వైఖరి వీడటంలేదు. విశాఖ స్టీలు ప్లాంటు సంగతి సరే సరి. మరి, జగన్ ఢిల్లీ టూర్‌లో ఈ అంశాలపై కేంద్రానికి ఎలా బలమైన వాదన వినిపిచంగలుగుతారు.? ఎంత బలంగా ఏపీ సీఎం రాష్ట్ర వాదనను వినిపించినా, కేంద్రం దిగొస్తుందా.? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టమే.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమస్యల్ని నివేదించడం ముఖ్యమంత్రి బాధ్యత. రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు సహా కీలక అంశాలపై ప్రధానితో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక చర్చలు జరిపే అవకాశమైతే వుంది.