వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుండి బీజేపీతో సఖ్యతగానే మెలుగుతూ వచ్చారు. ఏ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కాదు.. కాదు అస్సలు ఇబ్బంది పెట్టలేదు. పార్లమెంటులో బిల్లు పాస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడల్లా మోదీ అడగకుండానే జగన్ మద్దతిచ్చారు. మొన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలప్పుడు కూడా తన సభ్యులతో మద్దతు ఇప్పించేశారు. ఎక్కడా మోదీ లేదా ఇతర బీజేపీ ముఖ్య నేతలు జగన్ ను బ్రతిమాలాల్సిన అవసరం రాలేదు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణా సహా చాలా రాష్ట్రాలు కొత్త వ్యవసాయ బిల్లును, విద్యుత్ బిల్లును వ్యతిరేకించినా జగన్ మాత్రం మారు మాట్లాడకుండా ఆమోదం తెలిపారు.
జగన్ ఇదంతా ఊరికే చేయలేదనేది వాస్తవమే అయినా ఇప్పటికిప్పుడు తన డిమాండ్లు నెరవేర్చమని పట్టుబట్టలేదు. భవిష్యత్తులో అవసరమైనప్పుడు అడుగుదాంలే అన్నట్టే ఊరుకున్నారు. అందుకే ఏపీ బీజేపీ శాఖ మీద ఏనాడూ స్వయంగా పల్లెత్తి మాట అనలేదు. అదే బీజేపీ నేతలకు అలుసైపోయింది. మనం ఇక్కడేం మాట్లాడినా జగన్ ను ఎదురు మాట్లాడకుండా చేయడానికి పైన హైకమాండ్ ఉందని అనుకున్నారో ఏమో కానీ ఉన్నట్టయింది ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించేశారు. కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చాకే వైసీపీ మీద విమర్శలు ఎక్కువయ్యాయి.
తాజాగా రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులను ఆసరాగా చేసుకుని బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. మధ్యలోకి జగన్ మతాన్ని లాక్కొచ్చి హిందూ మతం మీద ఒక మతం పనిగట్టుకుని దాడి చేస్తోందని, దానికి వైఎస్ జగన్ మద్దతు ఉందని, జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో జగన్ కు చిర్రెత్తికొచ్చిందట. అందుకే బీజేపీను కాస్త కంట్రోల్లో పెట్టాలని నిర్ణయించుకుని ప్రత్యేక హోదా అంమాసాన్ని తెరపైకి తెఛ్చి పాలక వర్గంగా తమ బాధ్యత తాము నిర్వర్తిస్తే ఎలా ఉంటుందో చూపాలని అనుకుంటున్నారట. ఈమేరకు పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదా విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మంత్రులకు ఆదేశాలిచ్చారట. సో.. ఎక్కడ నొక్కితే బీజేపీ సైలెంట్ అవుతుందో అక్కడే నొక్కనున్నారన్నమాట జగన్.