YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి లండన్ పర్యటనలో ఉన్నారు. జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న సందర్భంగా జగన్ కుటుంబ సభ్యులందరూ కూడా లండన్ వెళ్లారు.
ఈ క్రమంలోనే తన కుమార్తె పట్టా అందుకున్న నేపథ్యంలో జగన్ సోషల్ మీడియా వేదికగా తన కుటుంబంతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్ తన కుమార్తె సాధించిన ఈ విజయం పై ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సాధారణంగా జగన్ కూతుర్లు ఎప్పుడు కూడా పెద్దగా బయట కనిపించరు. ఇక సోషల్ మీడియాకి కూడా వర్షారెడ్డి హర్ష రెడ్డి ఇద్దరు కూడా దూరంగా ఉంటారు. ఏదైనా ప్రత్యేక రోజులలో మాత్రమే వీరు బయట కనిపిస్తూ ఉంటారు. అలాంటిది జగన్ తాజాగా తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక ఈ ఫోటోలు చూసిన వైయస్సార్సీపీ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ కుమార్తె వర్షా రెడ్డి పట్టా అందుకున్న నేపథ్యంలో వైయస్సార్సీపి అభిమానులు కార్యకర్తలు సైతం వర్ష రెడ్డికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.