అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం : సీఎం జగన్ 

Why YS Jagan's government went to Supreme court
విజయవాడ స్వర్ణా ప్యాలెస్ నందు జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది.  ఒక ప్రైవేట్ ఆసుపత్రి లీజుకు తీసుకున్న స్వర్ణా ప్యాలెస్ ఈరోజు ఉదయం మంటల్లో చిక్కుకోడంతో ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదం జరిగే సమయానికి అందులో కోవిడ్ రోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి మొత్తం 50కి పైగానే ఉన్నారు.  మంటలు చెలరేగిన వెంటనే వైద్య సిబ్బంది బయటపడ్డారు కానీ రోగులు మాత్రం తప్పించుకోలేకపోయారు.  వారిలో 10 మంది అగ్నికి ఆహుతి కాగా ఇంకొంతమంది తీవ్ర గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్నారు.  మొదట ఆసుపత్రిలో తక్కువ మందే ఉంటారని వార్తలు రాగా ఇప్పుడు మాత్రం 50కి పైగానే ఉంటారని ఖరారైంది. 
 
ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.  ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు.  ఇక ప్రమాదంపై ప్రభుత్వం రెండు కమిటీలను వేసింది. ఒక కమిటీ హోంశాఖ, మరొక కమిటీ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.  రెండు కమిటీలు 48 గంటల్లోనే నివేదిక ఇవ్వనున్నాయి.  
 
ఒకవైపు నిర్లక్ష్యం కారణంగానే రోగుల ప్రాణాలు పోయాయని విమర్శలు వస్తుంటే సీఎం త్వరితగతిన స్పందించి 50 లక్షల పరిహారం ప్రకటించి మంచి మనసు చాటుకున్నారని అంటున్నారు.  గతంలో కూడా విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు జగన్.  కానీ వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువశాతం నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకనే జరిగాయు.  కనుక ప్రభుత్వం యంత్రాంగాలను ఆదేశించి పరిశ్రమకు, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు బలంగా ఉండేట్టు చూడాలి.