వైఎస్సార్ జయంతి సమయంలో ఉదయం షర్మిల, సాయంత్రం వైఎస్ జగన్.. విడివిడిగా వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. షర్మిలను కలవడం ఇష్టం లేక వైఎస్ జగన్, తన షెడ్యూల్ మార్చుకున్నారంటూ రకరకాల విశ్లేషణలు బయల్దేరాయి అప్పట్లో. కానీ, వైఎస్సార్ వర్ధంతి రోజున షర్మిల, జగన్.. తమ తల్లి విజయమ్మతో సహా, వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులు చాలామంది వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించగా, ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తమ అభిమాన నాయకుడికి నివాళులర్పిస్తున్నారు.
ఇక, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల, వైఎస్ జగన్‌తో తనకు విభేదాలున్నట్లుగా మీడియాకి లీకులు పంపిన వైనం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. టీడీపీ అనుకూల మీడియాకి షర్మిల పార్టీకి సంబంధించిన సమాచారం ముందస్తుగా తెలియడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిషేధించిన మీడియా సంస్థలకీ షర్మిల పార్టీ నుంచి ప్రకటనలు అందడం.. ఇవన్నీ అప్పట్లో జగన్ – షర్మిల మధ్య విభేదాల ప్రచారానికి ఊతమిచ్చాయి. కానీ, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఇదంతా జస్ట్ ఓ రాజకీయ ఎత్తుగడగా మాత్రమే మిగిలిపోయింది. వైఎస్సార్ జయంతి రోజున షర్మిల కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో, ఆ ఎపెక్ట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద వుండకుండా, అదే సమయంలో.. వైసీపీ ఎఫెక్ట్ షర్మిల పార్టీ మీద తెలంగాణలో వుండకుండా పక్కగా ప్లాన్ చేసి ఉదయం షర్మిల, సాయంత్రం వైఎస్ జగన్.. వైఎస్సార్ జయంతి నాడు వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారన్నమాట.