కేవలం యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులే తమంతట తాముగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనల్లో ‘జై ఎన్టీయార్’ అనే నినాదాలు చేస్తున్నారా.? టీడీపీ జెండా కాకుండా, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఫొటోతో కూడిన వేరే జెండాల్ని ప్రదర్శిస్తున్నారా.? ఈ అంశంపై ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలోనూ, తెలుగుదేశం పార్టీ అను’కుల’ మీడియాలోనూ చర్చ షురూ అయ్యింది.
మొదట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ ‘జై ఎన్టీయార్’ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. నిజానికి, ‘జై ఎన్టీయార్’ అంటే, స్వర్గీయ నందమూరి తారకరామారావుని ప్రస్తావిస్తూ చేసే నినాదం. చంద్రబాబు కూడా ‘జై ఎన్టీయార్’ అంటుంటారు. అదిప్పుడు, యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి సొంతమయిపోయినట్లే కనిపిస్తోంది. ఇక్కడే, చంద్రబాబుకి ఒళ్ళు మండుతోందట కూడా.
ఎప్పుడైతే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారో, ముందుగానే ఈ విషయమై టీడీపీకి ఉప్పందిందట. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్టీయార్ – అమిత్ షా భేటీని తమకు అనుకూలంగా మలచుకోవడానికి టీడీపీ, టీడీపీ అను’కుల’ మీడియా తొలుత ప్రయత్నించి, ఆ తర్వాత భంగపడింది.
ఇక, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీయార్ మనసులో ఏముంది.? అనే విషయాన్ని ఆరా తీయడం మొదలు పెట్టాయి టీడీపీ, టీడీపీ అను’కుల’ మీడియా సంస్థలు. అమిత్ షా ఎలాగూ సమాధానమివ్వరు, ఆయన్ని అడిగేంత సాహసం కూడా ఎవరూ చేసే పరిస్థితి లేదు. కానీ, ఎన్టీయార్‌ని ఆరా తీయడం కొంత తేలిక. అటు కుటుంబం తరఫున, ఇటు మీడియా తరఫున.. ఎలాగోలా ఎన్టీయార్ నుంచి సమాధానం రప్పించే ప్రయత్నాలు ఇప్పటికే షురూ అయినట్లు తెలుస్తోంది.
ఒక్కటి మాత్రం నిజం. ఎన్టీయార్ ప్రమేయం లేకుండా టీడీపీ కార్యక్రమాల్లో జై ఎన్టీయార్ జెండాలు, నినాదాలు యంగ్ టైగర్ అభిమానుల నుంచి వచ్చే అవకాశం లేదు. రాజకీయ అంశాలు అమిత్ షా భేటీలో చర్చకు వస్తాయనీ ఎన్టీయార్‌కి తెలుసు. ఎందుకంటే, జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ భేటీ వెనుక వున్న పెద్ద తలకాయ.! సో, మొత్తమ్మీద యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయంగా పావులు కదుపుతున్నాడనే అనుకోవాలేమో.!
కానీ, సినిమా కెరీర్‌ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చేంతటి సాహసం యంగ్ టైగర్ ఎన్టీయార్ చేస్తాడా.? అన్నదొక్కటే ప్రస్తుతానికి సస్పెన్స్.