కరోనా వైరస్ రెండో వేవ్.. యువతరాన్ని చిదిమేస్తోంది. మధ్యవయస్కులూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వృద్ధులకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కరోనా వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం వుందన్న కోణంలో దేశవ్యాప్తంగా తొలుత 60 ఏళ్ళు పైబడినవారికి వ్యాక్సిన్ అందించారు.. ఆ తర్వాత 45 ఏళ్ళు పైబడినవారందరికీ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ళ పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, చాలా రాష్ట్రాల్లో 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయసున్నవారికి వ్యాక్సిన్ అందడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణం.
మొదటి డోస్ వ్యాక్సిన్ కూడా 45 ఏళ్ళ పైబడినవారికి అందని దుస్థితి మన కళ్ళ ముందే జరుగుతోంది. అసలేం జరుగుతోంది దేశంలో.? రెండో వేవ్, యువతరాన్నీ.. మధ్య వయస్కుల్నీ చిదిమేస్తున్న దరిమిలా.. చాలా కుటుంబాలు ‘ఆధారాన్ని’ కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తోంది. ఒకటా.? రెండా.? బోల్డన్ని కుటుంబాలు కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలా పెద్ద దిక్కుని కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయిన వైనం గురించి నిత్యం మీడియాలో కథనాలు చూస్తూనే వున్నాం. 45 ఏళ్ళ పైబడినవారికి టీకాలు ఇవ్వాల్సిందే.. అదే సమయంలో 18 నుంచి 45 ఏళ్ళ వయసున్నవారికి తక్కువ సంఖ్కలో అయినా వ్యాక్సిన్లు వేయిస్తే, కొన్ని ప్రాణాల్నయినా కాపాడేందుకు వీలుపడుతుంది. వ్యాక్సిన్ విషయంలో ప్రపంచానికే పెద్దన్న భారతదేశం.. అని చెప్పుకున్నాం మనం ఆ మధ్యన. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దేశం కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన దేశానికి బలం యువత.. ఆ యువతను కరోనా కబళిస్తోంటే, పాలకులు ఏం చేస్తున్నారు.?