Yogi – Modi : యోగి – మోడీ.. బంపర్ విక్టరీ కొట్టిన ‘కమలం’ జోడీ.!

Yogi

Yogi – Modi : ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఈ జోడీ ఇంకోసారి విక్టరీ కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లో మళ్ళీ బీజేపీనే అధికార పీఠమెక్కబోతోందంటే, ఇటు మోడీ అటు యోగి.. (Yogi ) ఇద్దరూ కలిసి రచించిన రాజకీయ వ్యూహమే కారణం. ప్రత్యర్థుల వ్యూహాల్ని చిత్తు చేస్తూ, అత్కంత పకడ్బందీగా రాజకీయ వ్యూహాన్ని రచించారు మోడీ, యోగి. ఫలితంగా యూపీలో తిరిగి అధికార పీఠమెక్కుతోంది బీజేపీ.

యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే, సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్ని సమాయత్తం చేసే ప్రత్యేక బాధ్యతను భుజానికెత్తుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, బీజేపీకి అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.

కాగా, యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే చర్చ చాలానే జరిగింది ఎన్నికలకు ముందు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కావొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కావొచ్చు.. అదే అంచనాతో వున్నాయి.

అంతెందుకు, ఆంధ్రప్రదేశ్‌లో అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా.. యూపీలో బీజేపీకి ఎదురు దెబ్బ తగలాలనే కోరుకున్నాయి. కానీ, అందరి అంచనాల్నీ తల్లకిందులు చేస్తూ యోగి ఆదిత్యనాథ్ తిరిగి యూపీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ ప్రభావం ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై వుండనుంది.

మినీ సార్వత్రిక ఎన్నికలనదగ్గ స్థాయిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల చుట్టూ ప్రచారం జరిగిన విషయం విదితమే.