బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా బండారం ఈసారి ఇంకాస్త గట్టిగా బట్టబయలయ్యింది. అశ్లీల చిత్రాల వ్యాపారం చేస్తున్నట్లు రాజ్ కుంద్రాపై ఆరోపణలు రావడం, ఈ క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేయడం తెలిసిన సంగతులే. ఈ కేసులో తాజాగా ఛార్జి షీట్ దాఖలైంది. ఛార్జి షీటులో ఆసక్తికరమైన అంశాల్ని ప్రస్తావించారు విచారణ అధికారులు. దాదాపు 1500 పేజీలతో కూడిన ఛార్జి షీట్ దాఖలవడం ఈ కేసులో మరో హైలైట్. రాజ్ కుంద్రా అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటు పడ్డాడనీ, ఈ క్రమంలో నీలి చిత్రాల్ని నిర్మించడం ప్రారంభించాడనీ ముంబై పోలీసులు పేర్కొన్నారు. ముంబై క్రైం బ్రాంచ్ ఈ మేరకు చార్జి షీటులో ఆయా వివరాల్ని వెల్లడించింది. గత జులై నుంచి రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో వున్నాడు.
పలు రకాల ఓటీటీ సంస్థలకు రాజ్ కుంద్రా నీలి చిత్రాల్ని తయారు చేయించి విక్రయించేవాడట. ఇందుకోసం కొందరు నటీమణుల్ని కూడా రాజ్ కుంద్రా లోబర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే, అవి బూతు వీడియోలు కావనీ, శృంగార వీడియోలు మాత్రమేనని రాజ్ కుంద్రా నీలి చిత్రాల కోసం పనిచేసిన ఒకరిద్దరు నటీమణులు వ్యాఖ్యానించడం గమనార్హం. ముంబై శివార్లలో ఓ బంగ్లా వేదికగా నీలి చిత్రాల చిత్రీకరణ జరగడం, వాటిని రాజ్ కుంద్రా అండ్ టీమ్.. అత్యంత రహస్యంగా విదేశాలకు ఇంటర్నెట్ ద్వారా తరలించడం.. విదేశాల నుంచి ఆ వీడియోలు ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ అవడం, ఆయా యాప్స్ ద్వారా వీక్షకులు వీటిని డబ్బులు చెల్లించి చూడటం.. జరుగుతూ వచ్చింది. నిజానికి ముంబై పోలీసులు ఓ నటి అశ్లీల వీడియోలో నటిస్తోందంటూ ఆమెను అరెస్టు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. ఆ నటి అరెస్టు తర్వాత కొన్ని రోజులకి ఈ రాకెట్‌లో రాజ్ కుంద్రా పాత్ర బయటకు రావడం గమనార్హం.