ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడారన్నది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియో క్లిప్ సారాంశం. ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగుతోంది. రాజకీయ నాయకులు కక్కుర్తి పడటం అనేది ఓ కోణం ఇందులో. ఇంకోపక్క, ‘హనీ ట్రాప్’ లాంటివి వుండనే వున్నాయి. ఇవి చాలవన్నట్టు, ‘పొలిటికల్ ట్రాప్’ గురించి కూడా వింటూనే వున్నాం.
కుట్రపూరితంగానే గోరంట్ల మాధవ్‌ని ఈ వివాదంలో ఇరికించారని వైసీపీ అంటోంది. మొన్న మంత్రి రోజా తాజాగా హోంమంత్రి తానేటి వనిత.. ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘గోరంట్ల మాధవ్ తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు..’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, ‘ఆ తప్పు తేలడం’ ఇప్పట్లో జరిగే పని కాదన్నది ఓపెన్ సీక్రెట్.
వీలైనంత వేగంగా తనను ఈ ఆరోపణల నుంచి బయట పడేయాలని గోరంట్ల మాధవ్ పార్టీ అధిష్టానాన్ని వేడుకుంటున్నారన్నది తాజా ఖబర్. గతంలో పోలీస్ అదికారిగా పని చేసిన గోరంట్ల మాధవ్, తన ఉద్యోగ జీవితంలో ఇలాంటి ఎన్నో కేసుల్ని పరిష్కరించి వుంటారు. సో, ఆ వీడియో కాల్ నిజమా.? ఫ్యాబ్రికేటెడా.? అన్నది తేల్చడం ఎంత తేలిక పనో ఆయనకు తెలియకుండా వుంటుందా.?
ఉద్దేశ్యపూర్వక జాప్యమైతే ఈ కేసులో జరుగుతున్నమాట వాస్తవం. ఇది నేరమా.? నైతిక తప్పిదమా.? అన్న కోణంలో చర్చ జరుగుతోంది. అవతలి వ్యక్తి ఫిర్యాదు చేయనంతవరకు దీన్ని నేరంగా పరిగణించలేమన్నది ఓ వాదన. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ‘నాలుగ్గోడల మధ్య జరిగిన వ్యవహారం’ వ్యాఖ్యల వెనుక అసలు కోణం ఇదే.!
సో, ఎలా చూసినా గోరంట్ల వ్యవహారంలో ఆయన్ని బాధితుడిగా చూపేందుకే అధికార పార్టీనుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా స్పష్టమవుతోంది. ‘కురుబ’ సామాజిక వర్గ ప్రతినిథులు తెరపైకొచ్చి, దీన్ని ‘కుల జాడ్యం’ కోణంలో చూడటం కూడా అవే సంకేతాల్ని పంపుతోంది.