కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోందన్న ప్రచారం ఈనాటిది కాదు. జాతీయ స్థాయి రాజకీయాలు వేరు, రాష్ట్ర స్థాయి రాజకీయాలు వేరు. పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ నాయకత్వం వైసీపీ మద్దతు తీసుకుంది.. మరీ ముఖ్యంగా ‘రాజ్యసభ అవసరాల’ నిమిత్తం బీజేపీ అధిష్టానం, వైసీపీతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సాయాన్ని కూడా బీజేపీ కోరుతుంది. పార్లమెంటరీ రాజకీయాలు ఇలాగే వుంటాయ్.
ఇక, బీజేపీ జాతీయ నాయకత్వం వైసీపీ పట్ల కొంత సానుకూలతతో వున్నా, ఆంధ్రపదేశ్ రాజకీయాలకొచ్చేసరికి బీజేపీ – వైసీపీ మధ్య చిత్రమైన వాతావరణం కనిపిస్తుంటుంది. టీడీపీని విమర్శించే క్రమంలో బీజేపీ, వైసీపీ వాయిస్ ఒకేలా వుంటుంది. అదే సమయంలో వైసీపీని విమర్శించే విషయంలో బీజేపీ ఒక్కోసారి టీడీపీ తరహాలో వ్యవహరిస్తుంటుంది. ఇదిలా వుంటే, తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళితే, ఎన్డీయేలో చేరాలని అక్కడ ఆయనకు ఆహ్వానం లభించిందట. అయితే, ఈ విషయమై వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయమూ ఇంకా తీసుకోలేదంటూ మీడియాలో కథనాలొస్తున్నాయి. అసలు ఎన్డీయేలో వైసీపీ ఎందుకు కలుస్తుంది.? అన్నది ఇక్కడ అసలు సిసలు ప్రశ్న.
ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ చేస్తే, కేంద్రంలో వైసీపీ భాగస్వామి అయ్యేందుకు అవకాశం వుంది. కానీ, ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల బీజేపీకి లాభం లేదు.. అందుకే చంద్రబాబు హయాంలో ఇవ్వలేదు, జగన్ హయాంలోనూ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా అంశంతో 2024 ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంట్ అయితే చేస్తుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఆ ఎజెండాతోనే 2024 ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయట. సో, ఎలా చూసినా వైసీపీ.. ఎన్డీయేలో కలవడం అన్నది అసాధ్యమే. కాకపోతే, బయటనుంచి అంశాల వారీగా ఎన్డీయేకి వైసీపీ మద్దతివ్వొచ్చు.