2019 సంవత్సరమే ఏపీలో ఎన్నికల హడావుడితో బిజీగా ఉంది. ఆ తర్వాత ఏపీలో ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలి. త్వరలో తిరుపతి ఉపఎన్నిక మాత్రం జరగనుంది. మరోవైపు పక్క రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఎప్పుడూ ఎన్నికల హడావుడే. మొన్ననే దుబ్బాకలో ఉపఎన్నిక జరిగింది. మళ్లీ ఇప్పుడు గ్రేటర్ పోరు జోరుమీదుంది.
తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మృతితో అక్కడ ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. నో డౌట్.. తిరుపతి అంటే అది వైసీపీ ఖాతాలోకే. 2019 ఎన్నికల్లో బల్లి దుర్గా ప్రసాద్ బంపర్ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీని ఓడించారు.
అయితే.. ఈసారి వైసీపీ సానుభూతిని నమ్ముకోలేదు. బల్లి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం లేదు. దుర్గా ప్రసాద్ కొడుకు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ మాటిచ్చారట. దీంతో తిరుపతి ఉపఎన్నిక బరిలో వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తిని దించుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంత వరకు నిజం అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు బీజేపీ పార్టీ కూడా దూకుడు మీదుంది. జనసేనతో పొత్తు పెట్టుకొని మరీ.. ఈ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా.. తిరుపతి ఉపఎన్నికలో ప్రధాన పోటీ అంటే మాత్రం వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే.
అయితే.. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయింది. ఇంతలోనే ఏపీని ఏదో చేసేశారని చెప్పలేం. ఒకవేళ.. ప్రజలు.. అభివృద్ధి పరంగా చూస్తే.. వైసీపీకి అది మైనస్ కావచ్చు. దాన్ని టీడీపీ ప్లస్ చేసుకొని దూసుకెళ్లే అవకాశం మాత్రం ఉంది. అందులోనూ టీడీపీ ఈసారి వైసీపీకి గట్టి పోటీని ఇవ్వనుంది. ఒకవేళ.. అభివృద్ధి పరంగా చూసుకుంటే.. ప్రభుత్వం మీద ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా.. దాన్ని అవకాశంగా తీసుకొని టీడీపీ తిరుపతి ఉపఎన్నికలో గెలిచి.. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని చాటిచెప్పాలని ప్రయత్నిస్తోంది. చూద్దాం.. మరి ఈ ఎన్నిక ఎవరికి వరం కానున్నదో.. ఎవరికి శాపం కానున్నదో?